లయన్స్ క్లబ్ విజయవాడ మెడిక కార్యవర్గ సమావేశంలో గవర్నర్ గద్దె శేషగిరిరావు
క్లబ్ గవర్నర్ క్షేత్రస్థాయి పర్యటనలో విభిన్న సేవా కార్యక్రమాలు పరిశీలన
విజయవాడ: కులమతాలకతీతంగా సమాజంలో అందరికీ విద్యాభివృద్ధి, వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ విజయవాడ మెడికా పనిచేయాలని లయన్స్ క్లబ్ గవర్నర్ గద్దె శేషగిరిరావు అన్నారు. గవర్నర్ అధికారిక పర్యటన సందర్భంగా భవానీపురంలోని శివాలయం సెంటర్ సమీపంలో ఉన్న కొనకళ్ళ టవర్స్‌లో విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధరరావు నివాసంలో ఆదివారం సాయంత్రం క్లబ్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన క్లబ్ గవర్నర్ గద్దె శేషగిరిరావు మాట్లాడుతూ, విద్య, వైద్యం అంశాలతో పాటు పేదరికం అనుభవిస్తున్న ప్రజలకు వారివారి అవసరాలను గుర్తించి సమయోచితంగా సహాయం అందించేందుకు క్లబ్ సభ్యులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ముందుకు సాగాలని సూచించారు. క్లబ్ సభ్యులు అందరూ సమాజానికి ఇతోధికంగా పాటుపడాలని పేర్కొన్నారు. కొనకళ్ళ విద్యాధరరావు మాట్లాడుతూ, ఎంతో సమున్నతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికా సభ్యులకు ఆతిథ్యం ఇచ్చేందుకు తనకు అవకాశం కల్పించిన క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్తులోనూ ఇదేవిధంగా ఉన్నతమైన ఆలోచనలతో కూడిన సేవా కార్యక్రమాలు నిర్వహించాలని క్లబ్ సభ్యులకు సూచించారు. కార్యవర్గ సమావేశానికి ముందు గవర్నర్ రాక సందర్భంగా పలు సేవా కార్యక్రమంలో చేపట్టారు. ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులోని వెంకట సాయి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దుస్తులు, పండ్లు, గ్రైండర్‌ను పంపిణీ చేశారు. ఐరన్ యార్డులోని జీవ కారుణ్య ఆశ్రమంలో శునకాలకు ఆహారం అందించారు. విద్యాధరపురంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు గావించారు. కొనకళ్ళ విద్యాధరరావు నివాసంలో జరిగి సమావేశంలో క్లబ్ తరఫున నిర్వహించిన సేవలను కార్యదర్శి పువ్వాడ లక్ష్మీ శ్రీనివాస్ వివరించారు.
ఏడాది కాలంలో ఇప్పటివరకు సుమారు రూ.9 లక్షల వ్యయంతో 89 సేవా కార్యక్రమాలు నిర్వహించగా 22,769 మంది లబ్ధి పొందారని చెప్పారు. క్లబ్ అధ్యక్షుడు పైడిమర్రి వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ ఏడాది తన హయాంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ తరఫున నలుగురు బధిరులకు వినికిడి యంత్రాలు, వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.51వేలు, ఒక థార్మిక సంస్థకు రూ.15వేలు విరాళంగా అందజేశారు. ఒక వికలాంగునికి వీల్‌చైర్ బహుకరించారు. అలాగే పేదలకు రెండు బస్తాలు బియ్యం పంపిణీ చేశారు. సీపీఆర్ ఎవర్నేస్ ప్రోగ్రామ్ ఛైర్మన్ దేవతి నాగేశ్వరరావు, దాతలు ఆర్య, నారాయణరావు, పువ్వాడ లక్ష్మీ శ్రీనివాస్, సామ సత్యనారాయణ (పెద్ద బాబు), బచ్చు కృష్ణమూర్తి, మేడ నరసింహారావు, టి.వాసుదేవ గుప్తా, పొన్నూరు హరినాథ్ ప్రసాద్, కొనకళ్ళ విద్యాధరరావు దంపతులకు క్లబ్ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా క్లబ్‌లోని పూర్వ అధ్యక్షుల సేవలను కొనియాడుతూ వారందరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు కొత్త సభ్యులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో రీజియన్ చైర్‌పర్సన్ అన్నే కుసుమ, జోన్ చైర్మన్ వెంకట్ రెడ్డి, క్యాబినెట్ సెక్రటరీ రామారావు, ట్రెజరర్ ఈశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, ఎన్.వి.వి.ప్రసాద్, డాక్టర్ కోలా విజయ శేఖర్, క్లబ్ సభ్యులందరూ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.