రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరిన రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొదపాటి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొదపాటి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్రోత్సవంగా ప్రకటించాలని అభ్యర్థించారు.
400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోత్సవం ప్రతీ ఏటా 4 లక్షల మందికి పైగా భక్తులను ఆకర్షిస్తూ, కోనసీమ ప్రాంతపు సంప్రదాయాలకు, ప్రజా సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ కూడా ఈ ఉత్సవాన్ని ప్రశంసించారని తేజస్వి పొదపాటి తెలిపారు.
ఈ ప్రతిపాదనను ఇప్పటికే గౌరవ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కి సమర్పించామని, వారు ఈ విషయంలో సానుకూలంగా స్పందించారని, కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆయన పూర్తి అంకితభావంతో ఉన్నారని ఆమె తెలియజేసారు .
కోనసీమ ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వడం వల్ల తెలుగు సంస్కృతి పునరుద్ధరించబడటమే కాకుండా, స్థానికంగా ఘనంగా జరుపుకునే సంప్రదాయాలకు మరింత గౌరవం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు అని తేజస్వి పొదపాటి తెలిపారు.