ఓఎంసీలోసీజ్ చేసిన వాహనాల తుక్కు చోరీకి యత్నం
పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అనంతపురం: ఏపీ, కర్ణాటక సరిహద్దులో సీబీఐ సీజ్ చేసిన వాహనాలను కట్ చేసి, విడిభాగాలను చోరీ చేస్తున్న పది మంది శుక్రవారం పోలీసుల చేతికి చిక్కారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ కొన్నేళ్ల క్రితం ఇనుప ముడిఖనిజంతో పాటు అక్కడి యంత్రాలు, వాహనాలను సీజ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ముడిఖనిజాన్ని తరలించి, కర్ణాటకలో విక్రయించిన ముఠానే తాజాగా దొంగతనానికి పూనుకున్నట్లు తెలిసింది. వాహనాలలో 10 మంది బృందంగా వచ్చి గ్యాస్ కట్టర్లతో తుప్పుపట్టిన వాహనాలను విడిభాగాలుగా తొలగించారు.
అనంతరం వాహనాల విడిభాగాలను ఎత్తుకపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులో తీసుకున్నారు. బళ్లారితో పాటు ఉత్తరప్రదేశకు చెందిన కొందరు చోరీకి ప్రయత్నించారని సమాచారం. ముడి ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నవారే చోరీకి ప్రయత్నించారని అనుమానాలు కలుగుతున్నాయి. ఉత్తరప్రదేశకు చెందిన ముగ్గురు, కర్ణాటకలోని బళ్లారికి చెందిన నలుగురు, సిద్ధాపురం గ్రామానికి చెందిన ఒకరు, మరొకరు ముఠాగా ఏర్పడి పెద్ద పెద్ద కట్టర్లతో ఓఎంసీ మైనింగ్ ప్రాంతంలోకి ప్రవేశించారు.
సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని అదుపులో తీసుకున్నారు. కట్టర్లను, గ్యాస్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిని లోతుగా విచారిస్తున్నారని తెలిసింది. గత ప్రభుత్వంలో ముడిఖనిజం అపహరించిన వివరాలను కూడా పూర్తిస్థాయిలో సేకరిస్తున్నట్లు తెలిసింది.