తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల: సత్యాన్ని ప్రకటించడమే జర్నలిజమని, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో పని చేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ సత్యం కోసం పని చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ఆంజనేయులు హితవు పలికారు. మంగళవారం నాడు గోపాలపురం నియోజకవర్గ జర్నలిస్ట్ కార్యవర్గ సమావేశం ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం గ్రామంలో గల మురళీకృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సమాజంలో పనిచేస్తున్న ప్రతి పాత్రికేయుడు సమాజ శ్రేయస్సు కోసం పని చేయాలని సత్యస్థాపనే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. యూనియన్ లో చేరిన ప్రతి ఒక్క విలేఖరికి ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు నిత్యం అండగా ఉంటారని ఆయన తెలిపారు. పాత్రికేయుల సంక్షేమం కోసమే ప్రతి నియోజకవర్గంలో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తూ నూతన ఉత్తేజం ప్రతి ఒక్కరిలో నింపుతున్నామన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రంలోనే బలమైన యూనియన్ గా ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కే శంకర్రావు మాట్లాడుతూ పాత్రికేయులు అందరూ పాత్రికేయుల హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరైనా పాత్రికేయులపై దాడులు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాత్రికేయ వృత్తి అంటేనే స్వచ్ఛమైనదని, అటువంటి వృత్తికి బురద అంటించుకోకూడదని తెలిపారు. నీతివంతమైన రాతలు రాస్తూ సమాజానికి పట్టిన బురద కడిగేయాలన్నారు. అప్పుడే పాత్రికేయునికి గౌరవం గుర్తింపు కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏపీడబ్ల్యుఎఫ్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కండెల్లి శేఖర్ ని, సహచర కార్యవర్గాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు కండెల్లి శేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ధైర్యంగా పనిచేయాలని, అవినీతిని రూపుమాపేందుకు సమిష్టి కృషిగా ముందుకు సాగాలని ఆయన కోరారు. అవినీతి పై యుద్ధం చేసేటప్పుడు పాత్రికేయులపై దాడులు జరగడం సహజమని వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి, రక్షణకు తన వంతు ఎప్పుడు కృషి చేస్తానని అధ్యక్షులు శేఖర్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి రాజేశ్వరరావు మాట్లాడుతూ విలేకరులందరూ సమాజ శ్రేయస్సు కై ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. రానున్న రోజులలో యూనియన్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు కొడవటి బుజ్జి బాబు మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గం లో ఏపీడబ్ల్యుఎఫ్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రధమ కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో యూనియన్ లో సభ్యులను మరింత చేర్చి ఏపీడబ్ల్యుఎఫ్ ఔనత్యాన్ని చాటి చెప్తానని అన్నారు.
సీనియర్ రాష్ట్ర నాయకులు కొండబాబు, బాలశౌరి, ఎస్ ఆర్ టివి చానల్ అధినేత సత్యరాజ్, బిసిఎన్ చానల్ అధినేత షకీర్ బాబ్జి, ఏలూరు జిల్లా కార్యదర్శి తోట వెంకట్, పలువురు పాత్రికేయులు ప్రసంగించారు.
నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక...
గోపాలపురం నియోజకవర్గం ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు నూతన కమిటీ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. గోపాలపురం నియోజకవర్గ అధ్యక్షులుగా కండెల్లి శేఖర్, గౌరవ అధ్యక్షులుగా సజ్జ రమేష్ బాబు, ఉపాధ్యక్షులుగా కొడవటి బుజ్జిబాబు , ప్రధాన కార్యదర్శిగా కాకర్లమూడి రాజేశ్వరరావు, ట్రెజరర్ గా షేక్ హుస్సేన్, సహాయ కార్యదర్శిగా చెట్టె ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం రాష్ట్ర నాయకులకు దుస్సాలువ పూలమాలలతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ నాయకులు కే బాలసౌరి, రాష్ట్ర నాయకులు కొండబాబు, బీసీఎన్ టీవీ అధినేత షకిర్ బాబ్జి, ఏలూరు జిల్లా అధ్యక్షులు జబీర్, కార్యదర్శి తోట వెంకట్, ఉపాధ్యక్షులు సోమశేఖర్, ఎస్ ఆర్ టి వి అధినేత సత్తిరాజు, నియోజకవర్గ పాత్రికేయులు సిర్రారాజు, కలపాల శ్రీనివాస్, కొత్తూరి రామారావు, మర్రి రమేష్, మార్లపూడి ప్రభావతి, టి గంగరాజు, తోట రాము, తదితరులు పాల్గొన్నారు.