ఏలూరు/ ఆగిరిపల్లి: కోకో పంటకు సరైన గిట్టుబాటు ధర రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఏలూరు జిల్లాకు చెందిన రైతులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చొరవతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో జీరో పావర్టీ - పీ4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి శుక్రవారం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతులు సభ వేదిక వద్దకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతించకపోవడంతో సభ వేదిక బయట నిరీక్షిస్తున్న రైతులు ఎంపీ మహేష్ కుమార్ కంటపడ్డారు. కోకో రైతుల వద్దకు వెళ్లిన ఎంపీ మహేష్ కుమార్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోకో రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రైతులు నేరుగా కలిసేందుకు చొరవ చూపించారు. సమావేశం ముగించుకుని హెలిపాడ్ వద్దకు బయలుదేరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను తన వద్దకు పిలిపించుకొని మాట్లాడారు.
రాష్ట్రంలో 75 వేల ఎకరాలలో కొబ్బరి, ఆయిల్ పామ్ అంతర పంటగా కోకో సాగు చేస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో కోకో సాగు విస్తీర్ణం ఉందని, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి కోకో గింజలు ఉత్పత్తి చేస్తున్నామని, గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.1040/- వరకు ధర వచ్చిందని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.700కు పైగా ధర ఉన్నా ప్రస్తుతం కోకో గింజలు కొనుగోలు కంపెనీలు ఆ ధర చెల్లించడం లేదని, పాత, కొత్త గింజల పేరుతో కోకో రైతులను కంపెనీలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఇక్కడ కంపెనీలు సిండికేట్గా మారి కిలో కోకో గింజలకు రూ.480 నుండి రూ.550 వరకు ధర ఇస్తున్నాయని, అన్ సీజన్ గింజలను రూ.200 నుండి రూ.240 వరకు కొనుగోలు చేస్తున్నారని, ఇంతకు ముందు లేనివిధంగా గ్రేడింగ్ విధానం తీసుకొచ్చి తమను ఇబ్బందులు పెడుతున్నారని రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించారు.
కోకో రైతుల సమస్యలను ఓపికతో విన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమను ఆదుకునేందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చొరవ చూపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.