WORLD NEWS: ఈ సృష్టిలో ప్రేమకు మించిన శక్తి లేదు. చరిత్రలో కష్టసమయాల్లో ఆ ప్రేమ చూపిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. చైనాలో సరిగ్గా అలాంటి ఒక అద్భుతం జరిగింది. భార్య క్యాన్సర్తో పోరాడుతూ కోమాలోకి వెళ్లిపోయింది. బతకడం కష్టమని డాక్టర్లు కూడా ఆశ వదులుకున్నారు. తన చికిత్సకు డబ్బులు వృథా చేయొద్దని, తమ కుటుంబాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టొద్దని ఆమె భర్తను వేడుకుంది. కానీ ఆ భర్త మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ప్రేమను నమ్ముకున్నాడు. ఏకంగా 2,80,000 డాలర్లు (భారత కరెన్సీలో రూ.2 కోట్లకు పైగా) ఖర్చు చేసి, తన భార్యను మృత్యువు నుంచి తిరిగి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు.
చైనాలోని గువాంగ్జీకి చెందిన 30 ఏళ్ల డెంగ్ యూకాయ్ (Deng Youcai) అనే వ్యక్తి 2016లో యే మెయిడిని ఓ పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. డెంగ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో చిన్న వయసులోనే చదువు మానేసి కూలీగా మారాడు. ఇక యే మెయిడికు గ్లియోమా (Glioma) అనే బ్రెయిన్ ట్యూమర్ ఉందని డెంగ్కు తెలుసు. ఈ ట్యూమర్ 90 శాతం మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా సరే, యే మెయిడి వ్యక్తిత్వాన్ని డెంగ్ అమితంగా ఇష్టపడ్డాడు. ఆమె అనారోగ్యాన్ని లెక్కచేయకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు. మొదట యే తన అనారోగ్యం కారణంగా నిరాకరించింది. కానీ డెంగ్, ఆమె జీవితకాల పోరాటంలో తాను తోడుగా ఉంటానని నమ్మబలకడంతో యే మెయిడి అంగీకరించింది. 2019లో వారి పెళ్లి జరిగింది. అప్పుడు డెంగ్, యేతో "నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను, నా మాట ఎప్పటికీ తప్పను" అని మాటిచ్చాడు. 2021లో వారికి హన్హాన్ అనే ముద్దుల కుమార్తె పుట్టింది.
కానీ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒక సంవత్సరం తర్వాత యేకు మళ్లీ గ్లియోమా తిరగబెట్టింది. ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. కోమాలోకి వెళ్లడానికి ముందు, యే డెంగ్తో "నా కోసం డబ్బులు వృథా చేయొద్దు, నన్ను పోనివ్వు" అని చెప్పింది. ఆమె మాటలు డెంగ్ను మరింత కలిచివేశాయి.డెంగ్ ఆమె కోసం రెండు సర్జరీలు చేయించాడు. కానీ అవి విఫలమయ్యాయి. డాక్టర్లు కూడా తను దక్కదు ఆశలు వదిలేసుకోమని చెబుతారు. చేసేదేమీ లేక, డాక్టర్ల సలహా మేరకు డెంగ్ తన భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. కుటుంబ సభ్యులు చివరిసారి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. ఇంటి దగ్గర వారి కూతురు హన్హాన్, కోమాలో ఉన్న తల్లి యే చెంపపై ముద్దు పెట్టుకుంది. డెంగ్ ఆ పవిత్ర క్షణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
డెంగ్ పోస్ట్ చేసిన ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కంటతడి పెట్టారు. డెంగ్కు ధైర్యం చెప్పడమే కాకుండా చికిత్స కోసం డబ్బులు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత డెంగ్ యేను తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మూడు నెలల తర్వాత, యే కోమా నుంచి బయటకు వచ్చింది. రెండు నెలల తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది. ప్రతిరోజూ కోమాలో ఉన్న భార్యను సంతోషపెట్టడానికి పాటలు పాడుతూ, ఆమెతో కలిసి నాట్యం చేసేవాడు. ఇప్పుడు యే ఒక చిన్న దుకాణాన్ని కూడా నడుపుతోంది. ఈ జంటకు సోషల్ మీడియాలో దాదాపు 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.