WORLD, AMERICA NEWS: లాస్ ఏంజిల్స్ లో వలస వ్యతిరేక నిరసనలు ఆగడం లేదు. అవి రోజు రోజుకీ తీవ్రమవుతూ ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఎత్తివేసిన కర్ఫ్యూను మళ్లీ విధించారు. ఈ క్రమంలో ఆస్టిన్, డల్లాస్, చికాగో, టెక్సాస్, న్యూయార్క్, డెన్వర్ తో సహా అనేక ఇతర నగరాలకు ఈ నిరసన ప్రదర్శనలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లాస్ ఏంజిల్స్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం నుంచి అధికారులు ఇప్పటివరకూ 400 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరిలో 330 మంది పత్రాలు లేని వలసదారులు కాగా.. వీరిలో 157 మంది దాడి, అడ్డగింపు నేరాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. వీరిలో ఒకరు పోలీసు అధికారిపై హ్నత్యాయత్నం చేసేందుకు పాల్పడినట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో నిరసనలను అణిచివేయడానికి ట్రంప్ ప్రభుత్వం సుమారు 700 మంది మెరైన్లతో పాటు వేలాది మంది సైనికులను మొహరించింది. ఈ సందర్భంగా... గందరగోళ తీవ్రతను తగ్గించడానికి గురువారం ఉదయం వరకూ డౌన్ టౌన్ ప్రాంతంలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. విధ్వంసం, హింసను సహించమని ఆమె నొక్కి చెప్పారు.
మరోవైపు అమెరికాలోని ఇతర నగరాల్లోనూ అరెస్టులు, నిర్బందాలు చోటుచేసుకుంటున్నాయి. నిరసనకారులు వలస వ్యతిరేక నినాదాలు చేస్తూ, ఫ్లకార్డులు ప్రదర్శిస్తుండటంతో.. న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లో సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా జార్జియాలోనూ ఆరుగురు అరెస్ట్ అయ్యారు. చికాగో పోలీసులు 17 మందిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా... లాస్ ఏంజిల్స్ అంతటా అనేకమంది మేయర్లు కలిసి.. వలస వ్యతిరేక దాడులను ముగించాలని ట్రంప్ ను కోరారు. ఈ సందర్భంగా.. ఇది వైట్ హౌస్ చేసిన రెచ్చగొట్టే చర్యగా లాస్ ఏంజిల్స్ మేయర్ బాస్ అభివర్ణించారు. ఈ సందర్భంగా మా నివాసితులను భయభ్రాంతులకు గురి చేయడం ఆపాలని పారామౌట్ వైఎస్ మేయర్ బ్రెండా ఓల్మోస్ అన్నారు.