దర్శకుడికి కూడా ఇదే ఫస్టు మూవీ
సన్ నెక్స్ట్ వారు దక్కించుకున్న ఓటీటీ రైట్స్
ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'జగమెరిగిన సత్యం'. టైటిల్ చూసి ఇదేదో గ్రామీణ నేపథ్యంలో జరిగే ఉద్యమాలకు సంబంధించిన కథ అనుకుంటే పొరపాటే. కలవారి అమ్మాయికి .. పేదోడి ప్రేమకి మధ్య నడిచే కథ. ఇలాంటి కథతో రూపొందిన ఈ సినిమా, ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. కాకపోతే సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయింది.
అలాంటి ఈ సినిమా ఈ నెల 4వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్' ద్వారా ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 1994 కాలంలో .. తెలంగాణ నేపథ్యంలో నడిచే ఈ సినిమాతో హీరోగా అవినాశ్ వర్మ పరిచయమయ్యాడు. ఇతను హీరో రవితేజకి మేనల్లుడు కావడం విశేషం. దర్శకుడు పాలే తిరుపతికి కూడా ఇదే మొదటి సినిమా. ఈ సినిమాలో కథానాయికలుగా ఆద్య రెడ్డి - నీలిమ నటించారు.
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో ఈ కథ నడుస్తుంది. పేదింటికి చెందిన సత్యం, సర్పంచ్ మేనకోడలు అయిన సరితను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఈ విషయం సర్పంచ్ కి తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అనేది కథ. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

Shakir Babji Shaik
Editor | Amaravathi