ANDHRAPRADESH:బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
బంగాళాఖాతం ఉత్తర ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.
తాజాగా విజయవాడలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రంతా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల ఇళ్లల్లోకి వర్షపునీరు ప్రవేశించింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచాయి.
నేడు కూడా విజయవాడలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని, పిడుగులతో కూడిన భారీ వర్షం నమోదవుతుందని పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అలాగే- విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని, పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi