జగన్ కు అందిన మరో అస్త్రం


ANFHRAPTADESH:నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామంలో కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇండోసోల్ కంపెనీకి చెందిన సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదిత భూసేకరణను అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు. భూములు ఇవ్వడానికి ససేమిరా అంటోన్నారు.

ఫలితంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి రెవెన్యూ అధికారులు ఇటీవలే నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తీసుకున్న చర్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ గ్రామం నుండి వెళ్లిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఆందోళనలకు దిగారు. తమ సాగు భూములను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే టీడీపీ.. ఇదే ఇండోసోల్ కంపెనీని గట్టిగా వ్యతిరేకించిన విషయాన్ని రైతులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన ఇండోసోల్ కంపెనీకే అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ ఎలా సమర్థిస్తుందని, జగన్ బినామీగా ఆరోపించిన అదే సంస్థకు ఎలా భూములను కేటాయించడానికి ప్రయత్నిస్తుందని రైతులు ప్రశ్నిస్తోన్నారు.

ఉద్రిక్తతలు పెరగడంతో- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కరేడు గ్రామంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పోలీసులను మోహరింపజేశారు. రైతులను శాంతింపజేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఆ తర్వాత పరిస్థితిని క్రమంగా అదుపులోకి తీసుకునివచ్చారు.

తాజాగా కరేడు గ్రామానికి చెందిన రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. కొద్దిసేపటి కిందటే కరేడు రైతులు.. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తోందని ఫిర్యాదు చేశారు.

పచ్చని పంటపొలాలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ రకంగా బలవంతంగా లాక్కుంటే తమ పరిస్థితి ఏమిటని వాళ్లు ఆవేదన వ్య‌క్తం చేశారు. అనంతరం జ‌గ‌న్‌.. వారికి ధైర్యం చెప్పారు. వారి పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే కరేడు గ్రామానికి కూడా వస్తానని అన్నారు.


WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now