కోట’ మృతి సినీరంగానికి తీరని లోటన్న పవన్ కల్యాణ్
అన్నయ్య చిరంజీవితో కలిసి ప్రాణం ఖరీదు సినిమాతో ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారన్న పవన్ కల్యాణ్
విభిన్న పాత్రల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ‘కోట’అన్న పవన్
NATIONAL:ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ప్రముఖ సీనియర్ సినీ నటులు, మాజీ ఎమ్మెల్యే, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు అనేక భారతీయ భాషల్లో 700 చిత్రాలకు పైగా విభిన్న పాత్రల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి 'కోట' ఇకలేరు అనే వార్త సినీరంగానికి తీరని లోటని అన్నారు.
ముఖ్యంగా అన్నయ్య చిరంజీవితో కలిసి 'ప్రాణం ఖరీదు' సినిమాతో ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారని తెలిపారు. ఆయనతో కలిసి అర డజనుకు పైగా చిత్రాలలో నటించడం ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi