WORLD, INDIA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచానికి ఏమి చెప్పాలనుకున్నా... వాటన్నింటినీ తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలను టారిఫ్ ల పేరు చెప్పి బెదిరించడానికి సైతం సోషల్ మీడియాను వాడటం బాధ్యతారాహిత్యం అని బ్రెజిల్ అధ్యక్షుడు లాంటి వారు చెప్పినా ట్రంప్ వినరు! తాను ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసినంతమాత్రాన్న అది "ట్రూత్" అని నమ్మాలని అనుకుంటారో ఏమో కానీ.. కంటిన్యూ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా భారత్ ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో ప్రకటించారు. ఈ సందర్భంగా తాను ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. అవి... భారత్ లో సుంకాలు ఎక్కువని.. రష్యా నుంచి సైనిక పరికరాలు ఎక్కువగా కొనుగోలు చేస్తోందని.. చైనాతో కలిసి రష్యాకు అతిపెద్ద ఇంధన కొనుగోలుదారని! అయితే... ట్రంప్ ట్రూత్ పోస్టు ఫుల్ ఫాల్స్ అని ఘణాంకాలు చెబుతున్నాయి!
భారత్ పై తాను 25% సుంకాలు విధించడానికి గల కారణాలను ట్రంప్ వెల్లడించారు. భారత సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ప్రపంచంలోనే అత్యధికం అని ట్రంప్ చెప్పారు. ఇదే సమయంలో... చైనాతో పాటు రష్యాకు అతిపెద్ద ఇంధన కొనుగోలుదారుగా భారత్ ఉందని అన్నారు. ఇక.. రష్యా నుండే భారత్ తమ సైనిక పరికరాలలో ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేసిందని ట్రంప్ ఆరోపించారు.
భారతదేశ ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా!:
రష్యా నుండి భారతదేశం ఆయుధ దిగుమతుల గురించి ట్రంప్ ప్రధానంగా మాట్లాడారు. ఇక్కడ ట్రంప్ గమనించాల్సిన విషయం ఏమిటంటే... 1960ల నాటి అమెరికా ఆయుధ నిషేధమే భారత్ ను తన రక్షణ అవసరాల కోసం సోవియెట్ యూనియన్ వైపు చూసేలా చేసింది! పైగా ఇటీవల భారత్ స్వదేశీ ఆయుధాలను తయారు చేయడానికి లేదా వాటిని సహ-ఉత్పత్తి చేయడానికే మొగ్గు చూపిస్తుంది. ఇది ట్రంప్ కు తెలియంది కాదు!
స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) డేటా ప్రకారం.. భారతదేశ ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా క్రమంగా తగ్గింది. ఇందులో భాగంగా... 2009 –13 మధ్య రష్యా నుంచి భారత్ ఆయుధాల దిగుమతులు 76% ఉండగా... 2019 –23 నాటికి అది సుమారు 36%కి తగ్గింది. ఈ క్రమంలో... ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి భాగస్వాముల నుండి భారత్ ఆయుధ దిగుమతులు ఇటీవల గణనీయంగా పెరిగాయి.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు!:
భారత్ పై 25% సుంకాలు విధించడానికి ట్రంప్ చెప్పిన మరో ప్రధాన కారణం... రష్యా నుంచి చమురు దిగుమతులు ఎక్కువగా చేస్తోన్న దేశం భారత్ అని! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్... దాని ముడి చమురులో 88%, సహజ వాయువు అవసరాలలో సగం దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది.
వాస్తవానికి పశ్చిమాసియా నుండి చమురును కొనుగోలు చేసే భారతదేశం.. ఉక్రెయిన్ యుద్ధం మధ్య రష్యా నుండి ముడి చమురును దిగుమతి చేసుకోవడంలో వ్యాపార దృక్పథాన్ని (అక్కడ నుంచి తక్కువ ధరకు రావడంతో!) చూపింది! రష్యా నుండి భారత్ దిగుమతి చేసుకునే చమురు 40-45% ఉంటుందని అంటున్నారు!
నివేదికల ప్రకారం... ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా నుంచి భారత్ కు ముడిచమురు ఎగుమతులు 25% తగ్గగా... అమెరికా చమురు ఎగుమతులు 100% పెరిగాయి. ఈ విషయాలను ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా డేటా వెళ్లడించింది. ఇదే సమయంలో... అమెరికా నుండి భారత్ ఇంధన కొనుగోళ్లు 2024లో $15 బిలియన్ల నుండి సమీప భవిష్యత్తులో $25 బిలియన్లకు పెరుగుతాయని చెబుతున్నారు.
భారత్ ‘టారిఫ్ కింగ్’ – ‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థ’ ఎలా?:
భారత్ ను టారిఫ్ కింగ్ అని పదే పదే ట్రంప్ అభివర్ణించారు. ఇక్కడ ట్రంప్ & కో గమనించాల్సిన విషయం ఏమిటంటే... అమెరికాలో వ్యవసాయానికి అధిక సబ్సిడీలు లభిస్తుంటాయనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో... భారతదేశం తన వ్యవసాయం, పాడి పరిశ్రమలను, రైతులను.. అమెరికన్ ఉత్పత్తుల నుండి రక్షించుకోవడానికి అధిక దిగుమతి సుంకాన్ని ఉపయోగించింది!
ఆ లెక్కన చూసుకుంటే... యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఫైలింగ్స్ ప్రకారం... అమెరికా కొన్ని పాల వస్తువులపై 200% కంటే ఎక్కువ.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో పాటు కొన్ని తయారుచేసిన ఆహార పదార్థాలపై 130% కంటే ఎక్కువ విధించడం లేదా? అమెరికా చేస్తే మాత్రమే సంసారం అంటే ఎలా?
ఇక భారత్ ను చనిపోయిన ఆర్ధిక వ్యవస్థగా ట్రంప్ ఎద్దేవా చేశారు! ఇక్కడ అమెరికా అధ్యక్షుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే... ట్రంప్ చెప్పినట్లుగా భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు.. సజీవంగా ఉంది.. వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎంతలా అంటే... ఈ ఏడాది జపాన్ ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినంతగా!
అంతేకాదు... ఈ వేగం కొనసాగిస్తే 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయిన భారత వాస్తవ జీడీపీ వృద్ధి 6.5% అనే విషయం అగ్రరాజ్యాధినేతకు తెలియకపోతే ఎలా? ఈ "ట్రూత్" లు ట్రంప్ తెలుసుకోకుండా... "ఫాల్స్" మాటలను ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసి ఆత్మవంచన చేసుకుంటే ఎలా?