INDIA, WORLD NEWS: మోడీ మంచి మిత్రుడు, భారత్ తమకు మిత్ర దేశం అని అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. దీనికి అదనంగా పెనాల్టీలు ఉంటాయని తెలిపారు. రష్యాతో భారత్ సంబంధాల పేరు చెప్పి ఈ షాక్ ఇచ్చారు. మరోవైపు ఇరాన్ తో వాణిజ్యంలో భాగస్వాములయ్యాయని ఆరోపిస్తూ ఆరు భారత్ కంపెనీలకు షాక్ ఇచ్చింది వాషింగ్టన్.
రష్యాతో వాణిజ్యం పేరు చెప్పి భారత్ పై అమెరికా 25% సుంకాల విధించిన వేళ.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... భారత చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 20 సంస్థలపై చర్యలు చేపట్టింది. ఇందులో భారత్ కు చెందిన ఆరు కంపెనీలు ఉన్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన విదేశాంగ శాఖ.. చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మధ్య ప్రాచ్యంలో సంఘర్షణలకు ఇరాన్ ఆజ్యం పోస్తోందని.. ఉగ్ర ముఠాలకు ఆర్థిక మద్దతు కల్పిస్తోందని.. అందుకే టెహ్రాన్ పై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు చేపట్టిందని.. ఇరాన్ నుంచి పెట్రోలియం వాణిజ్యంలో భాగస్వాములైన 20 కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నామని తెలిపింది.
ఆంక్షలు పడిన భారత కంపెనీలు ఇవే!:
1. ఆల్ కెమికల్ సొల్యూషన్స్: 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇరాన్ నుంచి ఈ పెట్రోకెమికల్ ట్రేడింగ్ కంపెనీ సుమారు 84 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసినట్లు అమెరికా ఆరోపించింది.
2. గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్: గతేడాది కాలంలో 51 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్స్ ను ఇరాన్ నుంచి ఈ సంస్థ కొనుగోలు చేసినట్లు అమెరికా ఆరోపించింది.
3. జుపిటర్ డైకెమ్ ప్రైవేట్ లిమిటెడ్: 2024 - 25 కాలంలో దాదాపు 49 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇరాన్ చమురు ఉత్పత్తులను దిగుమతి చేసినట్లు ఈ సంస్థపై మోపిన అభియోగాల్లో పేర్కొంది.
4. రమణిక్ లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ: ఈ కంపెనీ 2024 జనవరి - 2025 జనవరి మధ్య సుమారు 22 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు, దిగుమతి చేసుకున్నట్లు అమెరికా ఆరోపించింది.
5. పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్: గత ఏడాది కాలంలో 14 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్ తో సహా ఇరాన్ పెట్రో కెమికల్స్ ను ఈ సంస్థ కొనుగోలు చేసినట్లు వాషింగ్టన్ వెల్లడించింది.
6. కాంచన్ పాలిమర్స్: 2024 ఫిబ్రవరి నుంచి అదే ఏడాది జులై మధ్య 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను యూఏఈ మధ్యవర్తిత్వ కంపెనీ నుంచి కొనుగోలు చేసి, దిగుమతి చేసుకున్నట్లు అమెరికా ఆరోపించింది.
ఈ సందర్భంగా వాషింగ్టన్ ఆంక్షలు విధించిన కంపనీల్లో... భారత్ తో పాటు యూఏఈ, తుర్కియే, ఇండోనేషియా దేశాలకు చెందినవి ఉన్నాయి. ఈ సందర్భంగా... ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునేవారు అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని.. తమతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారని వాషింగ్టన్ వెల్లడించింది.
ఈ కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షల వల్ల.. యూఎస్ ఆధారిత ఆస్తులను స్తంభింపజేయడం, అమెరికన్ సంస్థలు వీరితో వ్యాపారం చేయకుండా నిషేధించడం వంటి పరిణామాలు తలెత్తనున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో... ఈ సంస్థలలో 50 శాతానికి పైగా యాజమాన్యం ఉన్న ఇతర కంపెనీలపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంక్షల లక్ష్యం శిక్షించడం కాదు, ప్రవర్తనలో సానుకూల మార్పు తీసుకురావడం అని యూఎస్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.