ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ మేల్ హెల్త్ అసిస్టెంట్ల నియామకాలకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 730 మంది ఎంపీహెచ్‌ఏలు ఉంటారని...వీళ్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని తెలిపారు.ఈ క్రమంలో ఎంపీహెచ్‌ఏలను విధుల్లోకి తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించిన సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతున్న క్రమంలో పైలెట్ ప్రాజెక్టు అమలు తీరును అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...సంజీవని ప్రాజెక్టు త్వరలో రాష్ట్రస్థాయిలో అమలు చేయబోతున్నాం. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంది. ఈ క్రమంలో దీనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయాలి
‘టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి... నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. శిశువుల నుంచి వృద్ధుల వరకూ సంజీవని ప్రాజెక్టు ద్వారా వైద్య సేవలు అందాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.‘ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు... ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాం.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి... పోషకాహరాల వల్ల ఉపయోగాలేంటి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా చూస్తున్నాం. న్యూట్రిషన్ యాప్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఆహార అలవాట్లు మారితే... ఆరోగ్యం బాగుంటుంది
‘ప్రజారోగ్యం ప్రధాన అజెండాగా సంజీవని ప్రాజెక్టును చేపట్టాం. ప్రభుత్వం దగ్గరున్న డేటాను ఆధారంగా తీసుకుని ప్రజల ఆరోగ్యంపై విశ్లేషించడంతో పాటు...ప్రజలకు వద్దకు వెళ్లి శాంపిల్ సర్వేలు చేపట్టాలి. అప్పుడు ప్రజారోగ్యంపై పూర్తి స్థాయిలో అంచనాకు రావడానికి వీలుంటుంది. సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ అనే అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. దీంట్లో భాగంగా 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.‘ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద సిద్దంగా ఉండాలి.
ఎనిమీయా, కార్డియాక్, డయాబెటిక్, కిడ్ని, లివర్ వంటి రోగాలపై స్టడీ చేయాలి. ఎవరైనా రిస్క్ కేటగిరిలో ఉంటే వారిని అలెర్ట్ చేసి మెరుగైన వైద్య సాయం అందేలా చూడాలి. ఇక సాధారణ ప్రజల్లో కూడా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. ప్రజారోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నియోజకవర్గాల్లో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలించాలి. ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు లేదా పర్యావరణ సమస్యల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయనే అంశం పైనా ప్రజలకు వివరించాలి.
వ్యాయామం, యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా... సాధారణ ప్రజలు అనారోగ్య బారిన పడకుండా చూసుకోవడం... ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యను తగ్గించేలా ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడమే లక్ష్యంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలి’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ప్రజారోగ్యంపై నిరంతర పర్యవేక్షణ
‘ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలి. నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలి. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలి. దీనిపై కేంద్రానికి వివరాలు పంపాలి. రాష్ట్రంలో ఆస్పత్రుల నిర్మాణం, ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ప్రముఖ ఆస్పత్రి యాజమాన్యాలకు, లాభాపేక్ష లేకుండా ఆస్పత్రుల నిర్మాణం, నిర్వహణ చేపట్టే వారికి రాయితీలు ఇస్తాం.
క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం, వ్యాధుల తీవ్రత వంటి అంశాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.‘మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధులపై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అవేర్-2.0 వ్యవస్థలో అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ డేటా ఆధారంగా క్షేత్రస్థాయిలో అధికారులను అప్రమత్తం చేసే పరిస్థితి రావాలి. కాన్పు అయిన వెంటనే బర్త్ రిజిస్టర్ చేయాలి.”అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షలో మల్టీపర్పస్ మేల్ హెల్త్ అసిస్టెంట్ల నియామకాలకు సంబంధించిన అంశంపై మంత్రి సత్యకుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రస్తావించారు. 730 మంది ఎంపీహెచ్‌ఏలు ఉంటారని, వీళ్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని వివరించారు. వీళ్ల పోరాటం చాలా కాలంగా సాగుతోంది’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. మంత్రి, అధికారుల ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. ఎంపీహెచ్‌ఏలను విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
