కోరమాండల్‌ రైలుకి ‘సరిగ్గానే’ సిగ్నల్‌ ఉన్నా... లూప్‌లైన్‌లోకి ఎందుకొచ్చింది?


సుమారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌... మెయిన్‌లైన్‌లో తనదారిలో తాను వెళ్లకుండా లూప్‌ లైన్‌ లోకి వెళ్లి అక్కడున్న గూడ్స్‌ను ఢీకొట్టింది! పట్టాలు, బోగీలు చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో... హౌరా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బెంగళూరు నుంచి హౌరా వెళ్తోంది. మరో మూడు నాలుగు క్షణాలు దాటితే మొత్తం రైలు క్షేమంగా ముందుకు వెళ్లేదే. కానీ... అప్పటికే గూడ్స్‌ను ఢీకొని చెల్లాచెదురైన కోరమాండల్‌ బోగీలు హౌరా ఎక్స్‌ప్రెస్‌ చివరి నాలుగైదు బోగీలకు ధాటిగా తగిలాయి! 


శుక్రవారం రాత్రి ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంపై రైల్వే అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఇది. ఇంత ఘోరానికి కారణం... కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌లైన్‌లో కాకుండా లూప్‌లైన్‌లోకి వెళ్లడమే అని ఒక అంచనాకు వచ్చారు. ఇలా ఎందుకు జరిగిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది! రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం... ఇతర వర్గాలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అసలేం జరిగిందంటే...


రైలు ప్రమాదం శుక్రవారం రాత్రి 6.55 గంటలకు చోటు చేసుకుంది. చెన్నై వైపు వెళ్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ... బహనాగ్‌ బజార్‌ స్టేషన్‌కంటే ముందు... లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ ట్రెయిన్‌ను ఢీకొట్టింది. సరిగ్గా అదే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ (12864).. పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను ఢీకొట్టింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌ లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌పైకి ఎక్కేసింది. గార్డు బ్రేకప్‌ వ్యాన్‌ మాత్రం మెయిన్‌ లైన్‌లోనే ఉంది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్‌ సక్రమంగానే ఉంది. కోరమాండల్‌కు మెయిన్‌ లైన్‌కు సిగ్నల్‌ ఉండగా... లూప్‌ లైన్‌లోకి ఎలా వెళ్లిందనేదే ప్రశ్న! 


విశ్వసనీయ సమాచారం ప్రకారం... పారాదీప్‌ నుంచి మెయిన్‌ లైన్‌లో వెళ్తున్న ఒక గూడ్స్‌ను కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు దారి ఇవ్వడం కోసం బహనాగ్‌ బజార్‌ స్టేషన్‌ వద్ద లూప్‌ లైన్‌లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘లూప్‌ లైన్‌’ను రెడ్‌లో ఉంచి... కోరమాండల్‌కు మెయిన్‌ లైన్‌లో సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ప్రక్రియను ‘త్రూ లైన్‌’ అంటారు. (తొలుత గూడ్స్‌కు మెయిన్‌ లైన్‌లో ఇచ్చిన రెడ్‌ సిగ్నల్‌ను తీసేసి... తర్వాత వచ్చే కోరమాండల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం. దీనినే...సిగ్నల్‌ గివెన్‌ అండ్‌ టేకెన్‌ ఆఫ్‌ అంటారు.) ఇలా సిగ్నల్‌ ఇచ్చినప్పుడు పట్టాలదగ్గర ఉన్న ‘పాయింట్‌’ మారిపోవాలి. (కదులుతున్న రైలును ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌ పైకి మళ్లించడాన్నే ‘పాయింట్‌’ అంటారు.) కోరమాండల్‌ మెయిన్‌లైన్‌లో వెళ్లేలా ‘త్రూ’ కావాలి. కానీ... అలా జరగలేదు. 


సిగ్నల్‌ – పాయింట్‌ మధ్య లోపం తలెత్తింది. సిగ్నల్‌ బాగుంది కానీ... పాయింట్‌ మారకపోవడంతో, అప్పటికే గూడ్స్‌ వెళ్లిన లూప్‌లైన్‌లోకే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా వెళ్లింది. బహనాగ్‌ బజార్‌ రైల్వే స్టేషన్‌లోని డిజిటల్‌ సిగ్నల్‌ చార్ట్‌లో ఇదంతా నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. సిగ్నల్‌ ఇచ్చినా పాయింట్‌ ఎందుకు మారలేదనేదే ఇక్కడ ప్రశ్న! గతంలో పాయింట్‌ మార్చేందుకు రైల్వే సిబ్బంది లివర్‌ లాగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరంలేదు. స్టేషన్‌ మాస్టర్‌ తన గదిలో కూర్చుని కంప్యూటర్‌పై మౌస్‌తో క్లిక్‌ చేస్తే... మోటర్‌ ఆన్‌ అయి, పాయింట్‌ను పుష్‌ చేస్తుంది. మరి... ఇక్కడ పాయింట్‌ ఎందుకు మారలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం విషయంలో డ్రైవర్‌ (పైలట్‌) పాత్రపైనా చర్చ జరుగుతోంది. గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ముందుకు వెళ్లడం.. రెడ్‌ వస్తే ఆపడం.. నిర్దేశిత/సూచిత వేగంతో బండి నడపడం మాత్రమే పైలట్‌ పని. సిగ్నల్‌ ఇవ్వడం, పాయింట్‌ మార్చే బాధ్యత స్టేషన్‌ మాస్టర్‌దే. .


చక్రాలు బాగున్నాయా?

ఇప్పుడు రైల్వేలో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థలో... ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడమనేది జరగనే జరగదని ఒక నిపుణుడు తెలిపారు. రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ చాలా పకడ్బందీగా పని చేస్తుందని... ఒకటికంటే ఎక్కువ దశల్లో తప్పిదాలుచేస్తేనే ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వెరసి... కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చునని అంచనా వేశారు. చక్రాలు విఫలం కావడం, విరిగిపోవడం వల్ల రైలు పట్టాలు తప్పే అవకాశముంటుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ ప్రయాణికుల జంట చెప్పిన దాని ప్రకారం వారు ప్రయాణిస్తున్న బోగీ వెనుక ఉన్న మరో బోగీవీల్స్‌ విరిగిపోయి ఉన్నాయి.


01) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో గెలిచేది ఏవరు? 

మీ అభిప్రాయాన్ని ఓటు గుర్తు పై క్లిక్ చేసి ఆప్షన్స్ ఎంచుకోండి.. సీక్రెట్ ఓటింగ్ చేయండి.


రైల్వే ప్రమాదం సంబంధించిన వీడియోని చూడండి.. చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి..👇