• రాష్ట్రంలో ఆటిజం కేంద్రాలు, రీజనల్ ఒకేషనల్ హబ్ ఏర్పాటుకు కృషి
• వెల్లడించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS.,.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో సమగ్ర శిక్షా ప్రాజెక్టుకు రూ. 2361 కోట్లు, పీఏంశ్రీ పథకానికి రూ. 454 కోట్లు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నిధులు సమగ్ర శిక్షా పథకంలో అమలవుతున్న కార్యక్రమాలు, భవిత కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆటిజంతో ఇబ్బంది పడుతున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా 125 ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వినియోగిస్తామని వెల్లడించారు. ఆటిజం కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తొలిసారి ముందడుగు వేసిందని, ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసిస్తూ.. ‘ప్రారంభం తర్వాత అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాల్లో కూడా అమలుపర్చేందుకు కృషి చేస్తామని’ పేర్కొన్నారు.
పాఠశాలల్లో వృత్తి విద్య అభివృద్ధి దిశగా ఒకేషనల్ టీచర్లకు ట్రైనింగ్ వంటి కార్యక్రమాల కోసం నాలుగు జోనల్ సెంటర్లు (రీజనల్ ఒకేషనల్ హబ్) స్థాపించే యోచనలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో అన్ని కేజీబీవీల్లో సోలార్ గీజర్లు, బాలికల భద్రత దృష్టిలో ఉంచుకుని కేజీబీవీల్లో, పీఎంశ్రీ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 679 మండలాల్లో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియామకం కోసం చర్యలు తీసుకుంటామని సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., తెలిపారు.