ఏపీలో నేడు- రేపు ఈ జిల్లాలకు అలర్ట్: గోదావరి అంతకంతకూ

 


ANDHRAPRADESH:బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి

నేడు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వరదలు సంభవిస్తోన్నాయని సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు, వదంతులను విశ్వసించవద్దని స్పష్టం చేశారు. వరదలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారికంగా తెలియజేస్తుంటామని చెప్పారు.

ఈ భారీ వర్షాల ప్రభావం గోదావరిపై తీవ్రంగా పడింది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల గోదావరికి వరద ఉధృతి భారీగా పెరిగింది. వరద నీటితో పోటెత్తుతోంది. కొత్త నీటితో కళకళలాడుతోంది. గోదావరిపై నిర్మించిన రిజర్వాయర్లన్నీ కూడా గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోన్నాయి.

భద్రాచలం వద్ద ప్రస్తుతం 35.6 అడుగుల నీటిమట్టం నమోదైంది. అలాగే కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 14.9 మీటర్లకు చేరింది. పోలవరం వద్దా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ గోదావరి నది నీటిమట్టం 10.23 మీటర్లుగా రికార్డయింది. వరద ప్రవాహం అధికమౌతున్న కొద్దీ.. ఇది అంతకంతకూ పెరుగుతోంది.

అటు ధవళేశ్వరానికి ఇన్ ఫ్లో భారీగా పెరిగింది. ఇన్ ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తోన్నారు. అవుట్ ఫ్లో కూడా 5.57 లక్షల క్యూసెక్కులుగా రికార్డయింది.

వరద తీవ్రత నేపథ్యంలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక/లంకగ్రామ/లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వివిధ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక/లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now