ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పోరాటాలకు దిగారు.
ఉమ్మడి గుంటూరు తర్వాత.. చిత్తూరు జిల్లాలో పర్యటించారు జగన్. చంద్రబాబు సొంత జిల్లా ఇది. బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించారు. వారికి అండగా నిలిచారు. తన సంఘీభావాన్ని తెలియజేశారు. మామిడి రైతులు ఎదుర్కొంటోన్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు
ఇక తాజాగా మరో జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని చెబుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు, ఇటీవలే కొవ్వూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరుల దాడిలో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి .
ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తారని సమాచారం. ప్రసన్న కుమార్ రెడ్డికి ధైర్యం చెప్పాలని, ఆయనకు అండగా నిలవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ కలుస్తారు. నిజానికి ఈ నెల 3వ తేదీ నాడే జగన్ నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నప్పటికీ- అది సాధ్యపడలేదు.
ఈ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, తలశిల రఘురామ్, మేరుగ మురళి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి పూజిత ఏర్పాట్లను సైతం పర్యవేక్షించారు. జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకుంటామని, ఆయన హెలికాప్టర్ ను దిగనివ్వబోమని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
దీంతో తాత్కాలికంగా జగన్ తన నెల్లూరు పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడీ పర్యటన ఈ నెల 17వ తేదీన జగన్ చేపడతారని పార్టీ జిల్లా నాయకులు చెబుతున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాకాణితో పాటు ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శిస్తారని అంటున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi