వివేకా కేసులో కీలక పరిణామం..! సీబీఐకి సుప్రీం ఝలక్..!


ANDHRAPRADESH:ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ, సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతకు మించి సీబీఐకి ఈ కేసు దర్యాప్తుపై సీరియస్ నెస్ ఉందా లేదా తెలుసుకునేందుకు మూడు ప్రశ్నలు సంధించింది. వీటికి సమాధానాలతో వస్తే బెయిల్ రద్దుపై ఆలోచిస్తామని తెలిపింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తుందా లేదా ?, ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై అభిప్రాయం ఏంటి ?, వివేకా హత్య కేసు విచారణ, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగిస్దారా లేదా వంటి మూడు ప్రశ్నల్ని సీబీఐకి సుప్రీంకోర్టు సంధించింది. ఈ మూడు అంశాలపై సమాధానం ఇవ్వాలని, తదుపరి విచారణలో సీబీఐ కోరినట్లుగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరుపుతామని తెలిపింది.

వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డి తోపాటు ఈ కేసులో పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సీబీఐతో పాటు సునీతారెడ్డి సుప్రీంలో సవాలు చేశారు. ఈ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ ఎం ఎం సుందరేష్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అవినాశ్ రెడ్డితో పాటు బెయిల్ పై ఉన్న మిగతా నిందితులంతా సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూత్రా వాదించారు.

అలాగే సీబీఐ అధికారి రాంసింగ్, సునీత దంపతులపై దాఖలైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టును సిద్ధార్ధ లూత్రా కోరారు. అవినాశ్ రెడ్డి ఆదేశాలమేరకే రాంసింగ్, సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్టులో ఉందని, కాబట్టి దీని ఆధారంగా అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. అయితే సీబీఐ నుంచి ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు వచ్చాక బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now