![]() |
సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS |
విజయవాడ: ఈతరం విద్యార్థులు అపజయాన్ని అంగీకరించకుండా మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారని, వారిలో మనోధైర్యాన్ని నింపే చర్యలు అత్యవసరం అని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS, అన్నారు. దీనికోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ మరియు, మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియమించామని అన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సమాజ భాగస్వామ్యం అవసరమన్నారు.
కౌన్సెలర్ల శిక్షణకు ఇండ్లాస్ క్లినిక్, స్థానిక వైద్యులు సహకారం అందించాలని కోరారు. ఆదివారం విజయవాడ ఐఎంఏ కమ్యూనిటీ భవనంలో జరిగిన ఇండ్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్ (ఐసీజీసీ) 10వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ‘భవిత’ కేంద్రాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. సాధారణ విద్యార్థులక కంటే దివ్యాంగ విద్యార్థులు అత్యధిక ప్రతిభ గలిగినవారని, అలాంటి పిల్లలను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. దాదాపు 4,400 మంది దివ్యాంగ విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసి డిజిటల్ విద్య అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం క్రీడలతో కూడిన పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టనుందని, ఇది హోలిస్టిక్ ఎడ్యుకేషన్‌లో విప్లవాత్మక మార్పుగా నిలవనుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముందుగా ఇండ్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్ డైరెక్టర్ డా. విశాల్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాల గల పిల్లలకు సైక్రియాటిక్ ఎవల్యేషన్, ఫిజియోథెరపీ కౌన్సిలింగ్, స్పీచ్ థెరపీ, హోమ్ బేస్డ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ వంటి సౌకర్యాలు ఐసీజీసీ అందిస్తోందని వివరించారు. విజయవాడలో తొలిసారిగా దివ్యాంగ పిల్లల కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఐసీజీసీ అని అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, ముంబయి బ్రాంచుల్లో కూడా సేవలందిస్తున్నామన్నారు.
అనంతరం ఇండ్లాస్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో 255 మంది కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చారిత్రక నిర్ణయం అని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు, ఐ.ఏ.ఎస్ నాయకత్వం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిగా ప్రారంభమై ఐఏఎస్ అధికారిగా ఎదిగిన శ్రీనివాసరావు ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా. బి. హనుమయ్య, ఐఎంఏ కార్యదర్శి డా. వి.సురేష్ కుమార్, డాక్టర్ మంజిరీ దేశ్ పాండే తదితరులు పాల్గొని ఐసీజీసీ పోస్టర్ ఆవిష్కరించారు.
![]() |
పోస్టర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం |