మంజూరైన పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి గ్రౌండింగు పనులుపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి..
సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సిఈవో కి చైర్ పర్సన్ ఆదేశాలు..
స్టాండింగ్ కమిటీ సమావేశంలో జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ..
ఏలూరు జిల్లా, ఏలూరు: ఉభయ జిల్లాలో అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్తు చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా పరిషత్తు సిఇవో,ఉభయ జిల్లాల అధికారులు, జిల్లా పరిషత్తు సభ్యులతో కలసి చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ 1 వ, 7వ స్థాయి సంఘాల సమస్యలు, రెండవ విడతగా 2, 3, 4, 5, 6 స్థాయి సంఘాల సమావేశాల్లో ఆయా అంశాలపై సమీక్షంచారు.
మొదటిగా వివిధ శాఖల అధికారులు జిల్లాలో మండలాల వారీగా మంజూరైన పనులు, ప్రగతి లో పనులు వాటి వివరాలు, ఇంకా జరగవలసి ఉన్న పనుల వివరాలను వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు చైర్పర్సన్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దశలవారీగా ఇచ్చిన హామీలను నెరవేర్చు తున్నారని అన్నారు.
జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించుటకు అందరి సహకారంతో ముందుకు సాగుతున్నామని, ఈ విషయంలో అధికారుల పాత్ర కీలకమైనదన్నారు. జిల్లాలో మంజూరైన కొన్ని పనులు పూర్తిచేయని కారణంగా ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
జిల్లా పరిషత్తు సమావేశాలకు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుండి అధికారులు హాజరు కాకపోవడంతో హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. ఈ సందర్భంగా సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సిఈవో ను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్తు సిఇవో కె.భీమేశ్వర రావు,ఉభయ జిల్లాల వివిధ శాఖల అధికారులు,పలువురు జెడ్పి టిసిలు, తదితరులు పాల్గొన్నారు.