సీసంతో బంగారం.. 300 ఏళ్ల ప్రయత్నం సక్సెస్ అయ్యిందా?


GOLD NEWS: విలువైన ఖనిజాలు ఎన్నో ఉన్నా.. బంగారానికి సాటి వచ్చేది మాత్రం లేదన్నట్లుగా వ్యవహరిస్తారు సాదాసీదా ప్రజలు. BY: BCN TV NEWS ఎందుకంటే వారి జీవితాల్లో బంగారానికి మించిన విలువైన వస్తువ మరొకటి ఉండదు. ప్రపంచ ప్రజల్లో భారతీయులకు బంగారానికి ఉన్న బంధం మరే దేశ ప్రజలకు ఉండదనే చెప్పాలి. ఇదంతా ఎందుకంటే.. బంగారానికి సంబంధించిన ఒక కొత్త ఆవిష్కరణ ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే సమయంలో మరికాస్త నిరాశకు గురి చేస్తోంది.


ఇంతకూ విషయం ఏమంటారా? బంగారాన్ని సీసంతో తయారు చేసే విధానాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. కాకుంటే.. అది కొద్దిసేపు మాత్రమే బంగారంగా ఉంది. అది తర్వాత మళ్లీ తన పాత రూపాన్నే సంతరించుకుంది. ఆ కొద్దిసేపు మాత్రమే మారిన బంగారం ముచ్చటే శాస్త్రప్రపంచంలో భారీ చర్చగా మారింది. ఎందుకంటే బంగారాన్ని చేతి స్పర్మతో తయారు చేసేందుకు 300 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కాకపోవటమే దీనికి కారణం.

300 ఏళ్ల నుంచి ఏం జరిగింది? ఇప్పుడేం జరిగింది? అంటారా? అక్కడికే వస్తున్నాం. సుమారు 1700వ సంవత్సరంలో పోలాండ్ రాజు ఒక అల్ కెమిస్ట్ ను ఒక ప్రయోగశాలలో బంధించాడు. ఎందుకంటే.. బంగారాన్ని తయారు చేయాలని. అతను పురాతన గ్రంధాల్ని కుస్తీ పడుతూ.. బంగారాన్ని క్రియేట్ చేసేందుకు ఉన్న మార్గాలన్నింటిని ప్రయత్నించాడు. కానీ.. అవేమీ సఫలం కాలేదు.

ఆ తర్వాతి కాలంలో కూడా ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ.. ఏమీ సక్సెస్ కాలేదు. దాదాపు 300 ఏళ్ల తర్వాత సెర్న్ శాస్త్రవేత్తలు సీసంతో బంగారంగా మార్చటంలో సక్సెస్ అయ్యారు. అంతటి ఘన విజయం సాధించినా వారు నిరాశకు గురవుతున్నారు. కారణం.. సీసంతో వారు క్రియేట్ చేసిన బంగారం కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఉండి.. మళ్లీ సీసంగా మారిపోవటమే దీనికి కారణం. కాకుంటే.. కొన్ని క్షణాలు అయినా బంగారంగా మారటంతో శాస్త్రప్రపంచం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటోంది.

ప్రపంచంలోనే అతి పెద్ద.. అత్యంత శక్తివంతమైన పార్టికల్ యాక్సిలరేటర్ అయిన టార్జ్ హాడ్రన్ కొలైడర్ లో నిర్వహించిన ప్రయోగం (ఎ లార్జ్ అయాన్ కొలైడర్ ఎక్స్ పెరిమెంట్) లో సీసం అయాన్లను అత్యంత వేగంగా ఢీ కొట్టటం ద్వారా సీసం అణుకేంద్రాన్ని బంగారంగా మార్చటంలో సక్సెస్ అయ్యారు. సాధారణంగా సీసంలో 82.. బంగారంలో 79 ప్రోటాన్లు ఉంటాయి. సీసం అయాన్లు సుమారు కాంతి వేగంతో తిరుగుతున్నప్పుడు వాటి చుట్టూ శక్తివంతమైన విద్యుదయస్కాంత క్షేత్రాలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో సీసం అణుకేంద్రం నుంచి మూడు ప్రోటాన్లు విడిపోయి బయటకు వచ్చాయి. ఆ సమయంలో కాసుపు బంగారం అణు కేంద్రంగా మారింది.

దీంతో.. సీసంతో బంగారాన్ని తయారు చేసే మార్గాన్ని గుర్తించారు.కాకుంటే ఈ ప్రయోగం విజయం సాధించి విఫలమైంది. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రయోగాలతో బంగారాన్ని క్రియేట్ చేయొచ్చన్న విషయాన్ని గుర్తించారు. ఈ సమయంలో అందరికి వచ్చే సందేహం.. స్వచ్ఛ బంగారాన్ని ఎలా తయారు చేస్తారు? అసలు బంగారం ఎలా తయారవుతుందని? బంగారం ఎలా తయారవుతుందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. నక్షత్రాలు పేలిపోవటం.. అయస్కాంత జ్వాలల వంటి ఖగోళ ప్రక్రియలతో బంగారం పుట్టుకొస్తుంది.

మన భూమిలో హైడ్రో థర్మల్ ప్రక్రియలతోనూ బంగారం ఏర్పడుతుంది. ఖనిజాలతో నిండిన వేడి ద్రవాలు రాళ్ల మధ్య మార్గాల్లో పేరుకుపోయి.. గట్టిపడి బంగారంగా మారతాయి. భూమి నుంచి వెలికి తీసిన మలినాలతో కూడిన బంగారాన్ని ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ వంటి ప్రక్రియలతో శుద్ధి చేస్తారు. అప్పుడు మలినాలన్నీ పోయి 24 క్యారెట్ల బంగారం తయారవుతుంది. మొత్తంగా చూస్తే.. బంగారం గురించి సుదీర్ఘకాలంగా జరుగుతున్న ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు ఒక కీలక అడుగు వేశారని చెప్పాలి. కాకుంటే.. గమ్యం చేరేందుకు మరిన్ని మజిలీలు దాటాల్సి ఉంటుంది.