విప్లవాత్మక మార్పు దిశగా తెలంగాణ స్కూల్స్..!!


HYDERABAD:తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు విప్లవాత్మక మార్పు దిశగా సాగుతున్నాయి. తరగతి గదిలో ప్రతి విద్యార్థికీ సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించేలా ముందడుగు వేస్తోన్నాయి. బ్యాక్ బెంచ్ అనే పదం ఇక వినిపించని విధంగా సరికొత్త విద్యా వ్యవస్థకు క్రమంగా నాంది పలుకుతున్నాయి.

ఇటీవలే- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఈ దిశగా తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. తరగతి గదుల్లో బ్యాక్ బెంచీలు లేకుండా చేయడానికి వాటి అమరికలో మార్పులను సూచించారు. యూ షేప్ లో బెంచీలను అమర్చాలని ఆదేశించారు. ఫలితంగా బ్యాక్ బెంచీలు కనిపించవు. యూ షేప్ లో అమర్చిన బెంచీల మధ్య నిల్చొని టీచర్ పాఠాలను బోధిస్తారు. ఫలితంగా- అందరికీ సమానంగా అవి అర్థమౌతాయి.

మలయాళ సినిమా 'స్థానార్థి శ్రీకుట్టన్'.. దీనికి సంబంధించిందే. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో క్లాస్ రూమ్ ల సీటింగ్ ఎంతగానో ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీ కథాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కేరళ ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్ బెంచీలను తొలగించింది. 

ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. బ్యాక్ బెంచీలు.. టీచర్లు- విద్యార్థుల మధ్య దూరాన్ని పెంచుతాయని, అందుకే వీటిని తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యాబోధనలో ప్రతి విద్యార్థిని కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

విద్యార్థులు- ఉపాధ్యాయుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించేలా బ్యాక్ బెంచీలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని హరిచందన అభిప్రాయపడ్డారు. తరగతి గదులు, అందులో బెంచీలను U- ఆకారంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ లేఅవుట్ వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు.

ప్రత్యేెకించి- చదువులో వెనుకపడ్డ విద్యార్థులకు ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య క్రీడలకు సమాన ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ రెండింటినీ సమానంగా ప్రోత్సహించాలని సూచించారు. మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టుల్తలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా 10వ తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని అన్నారు.

ఇప్పుడు ఇదే విధానం జనగామలో అమలులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు జనగామ ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్ బెంచీలను తొలగించారు. అక్కడి బెంచీలన్నింటినీ కూడా యూ షేప్ లో అమర్చారు. తరగతి గదులను మరింత ఇంటరాక్టివ్‌గా, ప్రభావవంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

యూ షేప్ సీటింగ్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. 

బ్యాక్ బెంచీలకు భిన్నంగా యూ షేప్ లో సీటింగ్ అమర్చడం వల్ల ప్రతి విద్యార్థి కూడా టీచర్లకు స్పష్టంగా కనిపిస్తాడు. వాళ్లు ఏం చేస్తున్నారు? పాఠాలను సరిగ్గా వింటున్నారా? లేదా అనేది తెలుసుకోగలుగుతారు.

తరగతి గదిలో ఒకరు ముందు.. ఒకరు వెనుక అనేది ఉండదు. టీచర్లకు అందరూ సమానమే అనే భావన ఏర్పడుతుంది. విద్యాబోధన సమంగా అందరికీ అందుతుంది.

తాను బ్యాంక్ బెంచ్ స్టూడెంట్ ను కాదనే విశ్వాసం విద్యార్థుల్లో కలుగుతుంది. ఫలితంగా ఆ ఆత్మన్యూనత భావం తొలగిపోతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు పోటీగా, ధీటుగా బ్యాంక్ బెంచ్ స్టూడెంట్లు చదువుకునే అవకాశం కల్పించినట్టవుతుంది.

బ్యాక్ బెంచీల్లో కూర్చుని కాస్త అల్లరి చేసే విద్యార్థులు కూడా దారిలో పడతారు. టీచర్ల కంట్లో పడతామనే ఉద్దేశంతో వారు చదువుకోవడంపై ఫోకస్ పెట్టగలరు.

గ్రూప్ స్టడీస్ కూ ఈ విధానం అవకాశాన్ని కల్పించినట్టవుతుంది. విద్యార్థులు మరింత సులభంగా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఒకరినొకరు సహాయం చేసుకోవచ్చు. 
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now