సనాతన ధర్మం... మాటల కొలతలకు అందని ఓ జీవనశైలి. ఓ వ్యవస్థ. ఓ మార్గం. అన్నిటికీ మించి ఆవిర్భావం, అంతం లేని ఓ అనంత యానం. మనిషిని మనీషిని చేసే ఓ దార్శనిక సూత్రం. కాలపరిమితులకు కట్టుబడేది కాదు. ఒక్క మాటలోనో, కొన్ని పదాల్లోనో చెప్పగలిగే నిర్వచనమూ కాదు.
వ్యాకరణం ప్రకారం ‘ఇతి సనాతన ధర్మః’ సనాతనుని ధర్మం… సనాతనం అవుతుంది. సనాతనుడు అంటే జనన మరణాలకు అతీతమై, సృష్టికి కారణమైన భగవంతుడు. అంటే, భగవంతుడి ప్రేరణగా, ఆయన స్థాపించిన ధర్మం ఇది. సనాతన ధర్మం అనే వాక్యానికి అర్థం ఇదే. ఈ ధర్మాన్ని పాటించిన వారు సనాతనులు అవుతారు. సనాతన ధర్మానికి ఆద్యంతాలు లేవు. సృష్టి, స్థితి, లయ అన్నిచోట్లా ఉంటుంది. సనాతన ధర్మం ప్రళయకాలంలోనూ నశించదు. జీవరాశులన్నిటికీ రక్షణ కల్పిస్తూ, వారికి మనోగతమైన సంస్కారాన్ని అందిస్తూ, క్రమబద్ధమైన జీవన విధానాన్ని ప్రసాదిస్తుంది.
‘సనాతనం’ ఏం చెబుతున్నది..
సనాతన ధర్మం మానవులు సత్యవాక్పరిపాలన, అహింస, త్యాగనిరతి, ఇంద్రియ నిగ్రహం, పరోపకారం, అస్తేయం, నియమపాలన వంటి సమున్నత ప్రవృత్తులను అలవాటు చేసుకోవాలని బోధిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతతనీ, సామాజిక జీవితంలో గౌరవాలనూ అందుకోవాలని చెబుతుంది. వీటన్నిటినీ సాధన చేస్తూ, జీవితానికి అంతిమ లక్ష్యమైన మోక్షసాధన కోసం ప్రయత్నించడానికి ప్రేరణ కల్పిస్తుంది. ఇందుకోసం జీవుడిని అనేకవిధాలుగా ఉత్తేజితుడిని చేస్తుంది.
మరణం తర్వాత పొందే స్వర్గ నరకాల గురించి సనాతన ధర్మం చెప్పదు. జీవంతో ఉన్నప్పుడే, కండ్లకు కనిపించే ప్రపంచంలో భగవంతుడిని దర్శించమని చెబుతుంది. భగవంతుడి ప్రేరణగా ఏర్పడిన ప్రపంచంలోని ప్రతి అణువులో ఆయన్ను దర్శించాలనే సర్వోన్నతమైన భావన కలిగిస్తుంది. లౌకిక జీవనంలో ఉంటూనే అలౌకికమైన భావనలతో మనసును సంస్కరించుకోవడమనే అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన చేయడమే సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుంది.
‘యత్ జన్యం తద్ అనిత్యం’ ఏదైతే పుడుతుందో అది అనిత్యం. తప్పనిసరిగా నాశనం కావాల్సిందే అని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఇందుకు భగవంతుడికి కూడా మినహాయింపులేదు. అందుకే, వివిధ కర్తవ్యాలు నిర్వహించడం కోసం అవతారం ధరించిన పరమాత్మ కూడా కర్తవ్యం పూర్తి కాగానే అవతారం చాలించాడు. కానీ, సనాతన ధర్మం ఎప్పటికీ నశించదు. ఎందుకంటే, ఇది పుట్టిన ధర్మం కాదు. సనాతనంగా ఓ వ్యవస్థగా ఏర్పడినది. కేవలం మనుషులే కాదు వృక్షాలు, జంతుజాలం కూడా ఈ ధర్మాన్ని అనుసరిస్తూనే ఉంటాయి. కాబట్టి, సనాతన ధర్మానికి నాశనం ఉండదు. దాన్ని నాశనం చేయాలనుకునే మనుషులకు తప్ప.
సనాతన ధర్మం.. సత్యం పునాదిగా ఏర్పడింది. శ్రీరాముడు, హరిశ్చంద్రుడు మొదలైన పాత్రలే ఇందుకు ఉదాహరణ. ‘సత్యాన్నాస్తి పరోధర్మః, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ / సత్యేన వాయు రావాతి, సత్యేనాదిత్యో రోచతే / దివి సత్యం వాచః ప్రతిష్ఠా, సత్యే సర్వం ప్రతిష్ఠితం / సత్యేన సువర్గా ల్లోకాత్ చ్యవంతే కదాచన / సతాం హి సత్యం, తస్మాత్సత్యే రమంతే…’ అని వేదాలు చెబుతున్నాయి. అంటే, సత్యాన్ని మించిన ధర్మం లేదు. సత్యమే జ్ఞానం. అది అనంతమైన బ్రహ్మస్వరూపం. సత్యం వల్లే వాయువు వీస్తున్నది. సత్యం వల్లే వాక్కు శాశ్వతం అవుతున్నది. సత్యంలోనే జగత్తు అంతా ప్రతిష్ఠితమై ఉంది. సత్యాన్ని ఆచరించడం వల్ల మాత్రమే మానవులు స్వర్గం నుంచి కింద పడిపోకుండా ఉంటారు. సత్యమే శాశ్వతం అని ఈ వేదమంత్రానికి అర్థం. బృహదారణ్యక ఉపనిషత్తు కూడా ‘యో వై ధర్మః స సత్యం వై తత్’- సత్యం, ధర్మం వేర్వేరు కాదు. ఏది ధర్మమో అదే సత్యం. ఏది సత్యమో అదే ధర్మం అని స్పష్టంగా చెబుతున్నది.
ధర్మాన్ని మొదటగా మనకు అందించింది వేదం. దీనిద్వారా వేదానికి ధర్మమే మూలం అని తెలుస్తున్నది. కాబట్టి, వేదవాక్కు అంటే ధర్మబద్ధమైన వాక్కు అని అర్థం. దానికి తిరుగులేదు. ఎంతగా వితండవాదం చేసే వ్యక్తి అయినా వేదవాక్కును ఖండించలేడు. అదీ సనాతన ధర్మ శక్తి.
ధర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని నమ్మాలి. ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆశ్రయించాలి. ధర్మమార్గంలో నడవాలి. ధర్మాన్ని గౌరవించాలి. ‘యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్’ అని చెప్పాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు. పాండవులు ధర్మపరాయణులు కాబట్టే కృష్ణుడు పాండవ పక్షాన నిలిచి వారికి సహకరించాడు. అధర్మాన్ని తొక్కేశాడు. అధర్మపరులను అధర్మంతో ఎదుర్కోవచ్చు. అది తప్పుకాదు. ధర్మపరులను అధర్మంతో దెబ్బతీయకూడదు. ఇది పాపకార్యం. రుతుధర్మం వల్ల వర్షాలు వస్తున్నాయి. చెట్లుపండ్లు ఫలాలను ఇస్తున్నాయి. కాలధర్మం వల్లనే మనిషి మరణిస్తున్నాడు. సంయోగధర్మం వల్లనే మళ్లీ జన్మిస్తున్నాడు.
మానవ జీవితానికి పరమ ప్రయోజనమైన మోక్షాన్ని పొందడం కేవలం ధర్మంతోనే సాధ్యం. ధర్మబద్ధమైన ఆర్జన (అర్థం), ధర్మబద్ధమైన కామంతోనే మనిషి నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలడు. అందుకే మన పెద్దలు చతుర్విధ పురుషార్థాల్లో ధర్మాన్ని ముందువరుసలో పెట్టారు. సంపాదన అయినా, కోరికలైనా ధర్మాన్ని అనుసరించి ఉండాలని దీని అర్థం. అటువంటి ధర్మాన్ని పాటించి.. మానవజన్మను సార్థకం చేసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.
ధర్మం అంటే..
‘ధార్యతే ఇతి ధర్మః’- పరమార్థ దృష్టితో చూస్తే అందరినీ ధరించి పాలించే విశేష స్వరూపాన్ని ధర్మం అంటారు. వ్యవహార దృష్టితో చూస్తే సమాజంలో మనిషికి గౌరవాన్ని తెచ్చిపెట్టే అలవాట్లు, అవి అతని మనసులో స్థిరం కావడానికి అవసరమైన ఆలోచనా పద్ధతి, ఇందుకోసం అవసరమైన నియమాలు… వీటన్నిటినీ కలిపి ధర్మం అంటారు. ధర్మం అనే పదానికి పర్యాయపదాలు లేవు. ధర్మం అనే మాట కేవలం సనాతన వ్యవస్థలోనే ఉంది. మను స్మృతి ధర్మానికి పది లక్షణాలు ఉంటాయని చెబుతుంది. ‘ఓర్పు, క్షమ, దమం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీరత్వం, విద్య, సత్యం, అక్రోధం’- ఇవి ధర్మానికి ఉండే పది లక్షణాలు. సనాతన ధర్మం ఐహిక సుఖాలు పొందడాన్ని వ్యతిరేకించదు. కానీ, ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పదో చెబుతుంది. మితిమీరిన భోగలాలసత వద్దని హెచ్చరిస్తుంది. అంతిమ నిర్ణయాన్ని మనిషికే వదిలేస్తుంది. సనాతన ధర్మంలో ఏ ఒక్కచోటా ఇది ఇలాగే చెయ్యాలనే కఠినమైన చట్టం లేదు. ఏది మంచో, ఏది చెడో చెప్పడం, మంచి-చెడు వల్ల కలిగే లాభనష్టాలు వివరించడం మాత్రమే ఉంటుంది. ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్నది మనిషి విజ్ఞతకే వదిలేస్తుంది.
గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘BCN TV’’ దృవీకరించడం లేదు.
గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘BCN TV’’ దృవీకరించడం లేదు.