ANDHRAPRADESH:ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు తుది కసరత్తు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమలు ఇప్పటికే ప్రారంభించిన ప్రభుత్వం.. మహిళలకు ఉచిత బస్సు అమలు ముహూర్తాన్ని ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం విధి విధానాల పైన దాదాపు స్పష్టత వచ్చింది. ప్రయాణ దూరం.. కేటాయింపు బస్సుల పైన ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం వివరాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న బస్సులు.. సిబ్బంది ఈ పథకం అమలు కోసం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు ఈ పథకం వేళ కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి.
ఉచిత బస్సు ఇలా
ఏపీ ప్రభుత్వం ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనుంది. జిల్లా పరిధిలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, పాత జిల్లాల పరిధి.. కొత్తగ 26 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఏ కేటరిగీ బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి.. ఎంత మంది ప్రయాణం చేస్తున్నారనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగుతో పాటు, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో 88 శాతం ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాగిస్తున్నట్లు తేలింది. 12 శాతం బస్సులు మాత్రమే పొరుగున ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్లు గుర్తించారు.
ఉమ్మడి జిల్లాల్లో
ఈ లెక్కలు పరిశీలించిన తరువాత ఉమ్మడి జిల్లా పరిధి ప్రాతిపదికగా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,449 బస్సులు ఉన్నాయి. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ బస్సులు మొత్తం కలిపి 6,561 ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఉమ్మడి జిల్లాల్లోనే రాకపోకలు సాగిస్తున్నాయి. 1,897 ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. అయితే వీటిలో 70 శాతం ఉమ్మడి జిల్లాలలోనే తిరుగుతున్నాయి. మొత్తంగా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు అన్నీ కలిపి 8,458 బస్సులు ఉన్నాయి. ఈ లెక్కన పొరుగు జిల్లాలకు 8.5 శాతం మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. కాగా, 91.5 శాతం ఉమ్మడి జిల్లాలలోనే ప్రయాణిస్తున్నట్లు తేలటంతో.. ఉమ్మడి జిల్లా పరిధి లో ఈ పథకం అమలు కానుంది.
ఈ బస్సుల్లో అమలు
కాగా, ఈ పథకం అమలు గ్రామీణ, సిటీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు పరిమితం చేయనున్నారు. ఈ బస్సుల్లో రోజుకు 16.11 లక్షల మంది మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు. పథకం అమలు చేస్తే వారి సంఖ్య 26.95 లక్షలకు చేరుతుందని అంచనా. అంటే నిత్యం సగటున 10.84 లక్షల మంది ప్రయాణికులు పెరుగుతారని భావిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నాల్లో తిరిగే సిటీ బస్సుల్లో మాత్రం వారానికి 4 సార్లు రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ద్వారా ఆర్టీసీపై నెలకు రూ.242 కోట్ల భారం పడుతుంది. దీంతో, వీటి పైన మరోసారి పూర్తి స్థాయిలో చర్చించిన తరువాత అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi