ANDHRPRADESH:ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అలాగే వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలై కూడా ఏడాది అయింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోతోందంటూ ఇప్పటి నుంచే వైసీపీ ప్రచారం మొదలుపెట్టేసింది. దమ్ముంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటూ సవాళ్లు విసురుతోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా జగన్ పర్యటనలు కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
జగన్ అడ్డాగా భావించే పులివెందులలోనే వైసీపీతో అమీతుమీకి చంద్రబాబు సిద్దమయ్యారు. ఈ మేరకు అక్కడ జరుగుతున్న జడ్పీటీసీ ఉపఎన్నికలో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గత ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతా రెడ్డిని ఇక్కడ పోటీకి దించారు. ఇప్పటికే కడప జిల్లాలో మహానాడు నిర్వహించి వైసీపీకి సవాల్ విసిరిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ అడ్డాలో జరుగుతున్న ఉపఎన్నికల్లో పోటీకి సై అన్నారు. దీంతో ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
పులివెందుల జడ్పీటీసీగా ఉన్న తుమ్మల మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వైసీపీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు తుమ్మల హేమంత్ కుమార్ నే అభ్యర్ధిగా దింపింది. ఆయనకు పోటీగా టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతా రెడ్డి బరిలోకి దిగుతున్నారు. అయితే స్దానిక ఎన్నిక కావడంతో ఎవరికి వారు విజయావకాశాలపై ధీమాగా ఉన్నారు.
జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మరణంతో జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో తమకే సానుభూతి ఉంటుందని వైసీపీ భావిస్తుండగా.. అధికారంలో ఉండటంతో ఎలాగైనా ఈ ఎన్నికలో గెలిచి సత్తా చాటుకోవాలని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి, తమ్ముడు జయభరత్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేశారు. పులివెందులలో ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని బీటెక్ రవి ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే రాష్ట్రంలో వైసీపీ పరిస్దితిలో ఎలాంటి మార్పు లేదని టీడీపీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఓడితే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్లేనని వైసీపీ చెప్పుకునే ఛాన్స్ దొరుకుతుంది