ANDRAPRADESH, THIRUPATHI: తిరుపతి కార్పొరేషనులో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఆయుధంగా మారాయనే ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో స్కాం జరిగిందని వైసీపీకి చెందిన నాయకుడే ఆరోపణలు చేయడంతో అసలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఆర్ బాండ్ల స్కాంపై కూటమి ప్రభుత్వం ప్రాథమిక విచారణ జరిపింది.
ఏ కారణం చేతో దీనిపై సీరియస్ చర్యలు మాత్రం తీసుకోలేదు. రాజకీయ వ్యూహమో, లేక తగిన సమయం కోసం ఎదురుచూసిందో కానీ 15 నెలలుగా టీడీఆర్ బాండ్ల స్కాంపై మాటలే కానీ చేతలు వరకు వెళ్లలేదనేది స్పష్టమవుతోంది. అయితే తేనెతుట్టెను తట్టిలేపినట్లు విపక్షంలో ముఖ్య నేత తమ ప్రభుత్వ హయాంలో కుంభకోణం జరిగిందని ఆరోపించడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇన్నాళ్లు తర్జనభర్జన
రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీలో టీడీఆర్ బాండ్ల స్కాం జరిగిందని టీడీపీ, జనసేన పార్టీలు తొలి నుంచి ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా చాలా ఆరోపణలు చేసిన ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఏ కారణం చేత చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇన్నాళ్లు తర్జనభర్జన పడుతోంది.
ఒకవైపు లిక్కర్ స్కాం, మైనింగ్ స్కాం అంటూ ఇతర కుంభకోణాలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయించిన ప్రభుత్వం... టీడీఆర్ బాండ్ల స్కాంపై కనీసం పోలీసు కేసు కూడా నమోదు చేయలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఈ స్కాంపై భిన్నమైన వాదనలు వినిపించడంతో ఈ విషయంలో ప్రభుత్వం గందరగోళం ఎదుర్కొంటోందని అంటున్నారు.
మంత్రుల భిన్న ప్రకటనలు
దీంతో అక్రమాలు నిగ్గుతేల్చే పనిని విజిలెన్స్ ఆశించినంత వేగంగా చేపట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు మంత్రులు చేసిన ప్రకటన కూడా చర్చనీయాంశమవుతోంది. టీడీఆర్ బాండ్ల అవకతవకలపై విచారణ లోతుగా జరుగుతుందని తిరుపతి ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించగా, తిరుపతిలో పెద్దగా అవినీతి జరగలేదని మున్సిపల్ మంత్రి నారాయణ తేల్చేశారు.
ఈ సమయంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కల్పించుకుని టీడీఆర్ బాండ్ల స్కాం జరిగిందని ధ్రువీకరిస్తు, ఇందుకు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో పనిచేసిన కీలక అధికారి కారణమంటూ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ప్రతిపక్షంలో ఉన్న నేత ప్రభుత్వానికి ఉప్పు అందించేలా మాట్లాడటంపై వైసీపీలో చర్చకు దారితీసింది.
వైసీపీలో ఇంటర్నల్ టాక్
సీనియర్ నేత అయిన భూమన ఇలా మాట్లాడొచ్చా? అంటూ వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే అరెస్టులతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ప్రభుత్వం భూమన మాటలను ఆసరాగా తీసుకుని తిరుపతి, గుంటూరు, కాకినాడ, తణుకు నగరాల్లో టీడీఆర్ స్కాంపై అరెస్టులకు రంగం సిద్ధం చేస్తుందనే ప్రచారం వారిని మరింత భయపెడుతోందని అంటున్నారు. ఈ విషయంలో సైలెంటుగా ఉన్న ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఐఏఎస్ అధికారిణిపై భూమనకు ఏమైనా కోపం ఉంటే, ఆమె వైసీపీకి సన్నిహితంగా ఉంటారు కనుక, అధినేత ముందు పంచాయితీ పెట్టి తేల్చుకోవచ్చు కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో స్కాం చేస్తే, అప్పట్లో అధికారంలో ఉండి ఏం చేశారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుడు వదిలేసి ఇప్పుడు తమను ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం కరెక్టు కాదని, భూమన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారిణిని ఉద్దేశించి అయినా, ప్రభుత్వ చర్యలతో తాము కూడా ముప్పు ఎదుర్కోవాల్సివస్తుందని అంటున్నారు.
యాక్షనులోకి సర్కారు
మరోవైపు భూమన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల స్కాంపై భూజు దులుపుతున్నట్లు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్కాంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగిందని, ఇప్పుడు ఈ స్కాంను లిక్కర్ కుంభకోణంలో చేసినట్లే సిట్ విచారణకు ఆదేశించే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో నాలుగు నగరాల్లో టీడీఆర్ స్కాంపై కేసులు నమోదుకు అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.