ANDHRPRADESH:మాజీ సీఎం జగన్ జిల్లాల పర్యటనలు వివాదాస్పదం అవుతున్నాయి. జగన్ పర్యటనల వేళ ఆంక్షల విధింపు.. వైసీపీ నేతల జన సమీకరణ ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. జైలులో ఉన్న వైసీపీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారు. తాజాగా నెల్లూరులో జగన్ పర్యటన వేళ ఆంక్షలను ఉల్లఘించిన నేతల పై పోలీసులు కేసు నమోదు చేసారు. ఇక, ఇప్పుడు జగన్ గోదావరి ప్రాంతానికి యాత్రకు సిద్దమయ్యారు. పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు రాజకీయంగా ఈ పర్యటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
మాజీ సీఎం జగన్ వరుసగా పరామర్శల కోసం జిల్లాలకు వెళ్తున్నారు. పల్నాడు పర్యటన వేళ చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ పర్యటనల వేళ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. జగన్ పర్యటనల ను వైసీపీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. భారీగా జనం వస్తుండటం తో తమ బలం ఏంటో నిరూపించుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అటు పోలీసులు సైతం ఆంక్షలు ఉల్లంఘించిన వారి పైన కేసులు నమోదు చేస్తున్నారు. తన పర్యటనల పైన ఎందుకు ఇంతగా భయపడుతున్నారని జగన్ ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జైలులో కాకాణి గోవర్ధన్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించటాన్ని టీడీపీ నేతలు తప్పు బడుతున్నారు.
జగన్ పర్యటన వేళ ఆంక్షలను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక, ఇప్పుడు జగన్ కూటమికి కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నెల 5న రాజమండ్రి జైలులో మిథున్ పరామర్శకు జగన్ నిర్ణయించారు. గత నెల 20న అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహా బ్లాక్ లో ఉన్నారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయం లోనూ ఇదే బ్లాక్ లో ఉన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
మిథున్ రెడ్డి అరెస్ట్ ను జగన్ ఇప్పటికే ఖండించారు. అసలు లిక్కర్ వ్యవహారాలతో మిథున్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాగా, జగన్ రాజమండ్రి పర్యటనకు వస్తున్న వేళ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పర్యటన వేళ మరోసారి పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు రాజమండ్రి పర్యటన పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.