చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో మానవ హక్కుల దినోత్సవాన్ని తహసిల్దార్ శ్రీమతి డి.ఎల్. ప్రమద్వర గారి ఆధ్వర్యంలో సచివాలయం–4 నందు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ డి.ఎల్. ప్రమద్వర మాట్లాడుతూ, మానవ హక్కులు అనేవి జాతి, లింగం, దేశం, మతం వంటి ఏవిధమైన భేదాలు లేకుండా ప్రతి మనిషికి పుట్టుకతోనే లభించే ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలని తెలిపారు. ప్రతి వ్యక్తి గౌరవంగా, స్వేచ్ఛగా జీవించడానికి మానవ హక్కులు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
విద్య, పని, ఆరోగ్యం వంటి హక్కులు, హింస, బానిసత్వం, చిత్రహింసల నుండి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి అంశాలు మానవ హక్కులలో భాగమని ఆమె వివరించారు. ఈ హక్కులను ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. అనంతరం తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్, వారి సిబ్బందితో పాటు సచివాలయం–4 పరిధిలోని ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. తదనంతరం సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తనగాల మల్లయ్య, కాటూరి ఏలియా, పొదిలి రాయప్పతో పాటు పలువురు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మానవ హక్కులపై అవగాహన కల్పించినందుకు తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ మరియు వారి సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతాభినందనలు తెలిపారు.
