ఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తీరు చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అని అరచినట్లు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రి నిమ్మల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
పోలవరం నిధులు దారి మళ్లించారు..
2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం పోలవరానికి రూ.11,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందని, ఆ సమయంలో కేంద్రం రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 4,167కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని, కానీ మా హయాంలో జరిగిన పనితో కలుపుకుని రీయింబర్స్‌మెంట్ కింద రూ.8,382కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. అలా వచ్చిన పోలవరం నిధులను ప్రాజెక్టు కోసం ఖర్చుపెట్టకుండా దారి మళ్లించిన ఘటన వైసీపీదే అంటూ మంత్రి ఆగ్రహించారు. కేంద్రం నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు చేసిన చరిత్ర టీడీపీది అని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ కుంగిపోవడం సహా అంచనాలు పెంచి టెండర్లు పిలిచిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నట్లు మంత్రి తెలిపారు. శాఖాపరంగా దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
మీ వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది..
వైసీపీ హయాంలో ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల 2020 భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నమాట వాస్తవం కాదా అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మంత్రి నిమ్మల ప్రశ్నించారు. దీనిపై ఐఐటీ హైదరాబాద్ నిపుణులు ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా అంటూ ఆగ్రహించారు. 2014-19మధ్య ఉన్న ఏజెన్సీలను రద్దు చేయడం వల్లే కొత్త ఏజెన్సీ పనులు చేపట్టడానికి 13నెలల సమయం పట్టిందని మంత్రి చెప్పారు. వైసీపీ తీరు వల్ల ఆ 13నెలల సమయమంతా వృథా అయ్యిందని ధ్వజమెత్తారు. ఒకే పనిని రెండు ఏజెన్సీలతో చేయిస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లేఖ రాయడం నిజం కాదా జగన్ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. ఏజెన్సీలను మార్చడం సరికాదంటూ పీపీఏ మినట్స్‌లో నమోదు చేసిన విషయం నిజమా.. కాదా?. ఈ ప్రశ్నలన్నింటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ మంత్రి నిమ్మల సవాల్ విసిరారు.
అక్రమాలు చేసి ఫైళ్లు మాయం చేస్తారా?
వైసీపీ ప్రభుత్వంలో చేసిన పాపాలకు సాక్ష్యాలు లేకుండా చేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యాలయాల్లో ఫైళ్లు మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి శాఖలోనూ ఫైళ్లు ధ్వంసం చేసే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారని ఆరోపించారు. దీనికి పుంగనూరులో ఆర్డీవో కార్యాలయంలో ఫైళ్లు దహనం చేసిన ఘటనే ఉదాహరణ అని చెప్పారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే దస్త్రాల దహన కార్యక్రమం చేపట్టారని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.