ANDRAPRADESH: రైతు బజార్‌లో మంగళవారం సొరకాయ ధర ఒకటి రూ.18 నుంచి 20. రైతుకు గిట్టుబాటు ధరతోపాటు లాభం కూడా కలిపి మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన రేటు ఇది! మరి... ఇదే సొరకాయ బయటి దుకాణాల్లో ఎంతుండాలి? బయటి వ్యాపారి తన లాభం కూడా చూసుకుంటాడు కాబట్టి... ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువ ఉండొచ్చు! కానీ... 40 నుంచి 50కి తగ్గలేదు! ఏమిటీ ధరల దందా? ఇందులో రైతుకు దక్కేదెంత? దళారులు దండుకున్నది ఎంత? ధరలను నియంత్రించాల్సిన మార్కెటింగ్ శాఖ ఏం చేస్తున్నట్లు? మండు వేసవిలో, వరదల సమయంలో కూరగాయల ధరలు పెరగడం సహజం! పంటలు దెబ్బతిని, సరఫరా ఆగిపోవడమే దీనికి కారణం! ఆ తర్వాత మళ్లీ ధరలు దిగి వస్తాయి. కానీ... రాష్ట్రంలో నాలుగైదు నెలలుగా కూరగాయల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. కిందికి దిగి రావడమే లేదు.
ఎండాకాలం, వానాకాలం తేడాలేదు! ఇది... కూరగాయల ధరలు మండే కాలం! ఇవేం ధరలని ప్రశ్నిస్తే... భారీ వర్షాలు, వరదలు, కొన్ని చోట్ల అనావృష్టితో కూరగాయల సాగు తగ్గిందని, ఉత్పత్తి పడిపోయిందనే సమాధానాలు వస్తున్నాయి. నిజానికి... ఐదారు నెలలుగా ధరల బాదుడుతో వినియోగదారులకు తల బొప్పి కడుతూనే ఉంది. ఉల్లి, టమాటా, బంగాళాదుంప ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా... రైతులకు దక్కుతున్నది తక్కువ, దళారులు దండుకున్నదే ఎక్కువ. క్షేత్రస్థాయిలో వాస్తవ ధరలను పరిశీలిస్తూ... ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ధరలపై పర్యవేక్షణ ఏదీ?
హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల మధ్యే భారీగా ధరల వ్యత్యాసం కనిపిస్తోంది. మదనపల్ల్లె మార్కెట్‌లో పది కిలోల టమాటా రూ.200 నుంచి రూ.450 మించి కొన డం లేదు. ఉత్పత్తి పెరిగితే రైతుకు ఇంకా ధర తగ్గుతుంది. కానీ... మార్కెట్‌లో ఆరునెలలుగా టమాటా ధర కిలోకు రూ.50 తగ్గలేదు. ఇప్పుడు ఏకంగా 80 నుంచి వంద పలుకుతోంది. ఉల్లి కొత్త పంట మార్కెట్‌కు వచ్చినప్పుడు ధరలు తగ్గాలి. కానీ, హోల్‌సేల్ వ్యాపారులు పాత ఉల్లికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కొత్త ఉల్లిని పాత ఉల్లి రేటుకు అమ్ముతున్నారు. మహారాష్ట్రలో పాత ఉల్లి టన్ను ధర రూ.3,500 ఉండగా... ఏపీలో కిలో రూ.80 వరకు పలుకుతోంది.
ఇదేనా జోక్యం?
టమాటా, ఉల్లి ధరలు బాగా పెరిగినప్పుడే మార్కెటింగ్‌శాఖ కదులుతోంది. అదీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే. రైతుకు పెట్టుబడి వ్యయం ఎంత? వారికి దక్కాల్సిన ధర ఎంత? హోల్‌సేల్ వ్యాపారులు రైతు దగ్గర ఎంతకు కొంటున్నారు? రిటైల్ మార్కెట్‌లో ధరలు ఎంతున్నాయి? ఇవేవీ పట్టించుకోవడంలేదు. టమాటా ధరలు పెరగడంతో ఇటీవల మార్కెటిం గ్ శాఖ అనంతపురం, పులివెందుల నుంచి టమాటా కిలో రూ.65నుంచి రూ.75 చొప్పున లక్షా 35వేల కిలోలు కొనుగోలు చేసింది. ఉల్లిపాయలు కర్నూలు మార్కెట్‌లో రూ.29, ఎన్టీఆర్ జిల్లాలో 31, నంద్యాలలో రూ.32 చొప్పున 21వేల కిలోలు సేకరించింది.
ప్రభుత్వమే హోల్‌సేల్ వ్యాపారుల నుంచి భారీ ధరలకు కొనడంతో ఇతర జిల్లాల్లో వ్యాపారు లు ధరలను మరింత పెంచేశారన్న వాదన వినిపిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో టమాటా ధర పెరుగుదలకు పరోక్షంగా మార్కెటింగ్ శాఖే కారణమన్న విమర్శలొచ్చాయి. కూరగాయల ధరలకు రైతు బజార్లు ప్రమాణికం! కానీ... రాష్ట్రవ్యాప్తంగా కేవలం 111 రైతు బజార్లు మాత్రమే ఉన్నాయి. అవన్నీ పట్టణాలకే పరిమితమయ్యాయి. ప్రతి మునిసిపాలిటీలో కనీసం ఒక రైతు బజారు పెట్టాలన్న ప్రతిపాదన కాగితాల దశ దాటడం లేదు. పట్టణాలు, నగరాల్లో మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌నూ పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలో కేవలం విజయవాడలో మాత్రమే 16 మొబైల్ రైతు బజార్లను నిర్వహిస్తున్నారు.
రైతుకు దక్కేది మూడోవంతే!
వ్యవసాయ పంట ఉత్పత్తుల మాదిరిగానే కూరగాయ పంటలు పండించే రైతులకూ గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో రైతు నుంచి రిటైలర్ వరకు ఏం జరుగుతోందనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక అధ్యయనం చేసింది. రైతుకు రూపాయి పంట విలువలో మూడో వంతు కూడా దక్కడం లేదని తేలింది. వినియోగదారుడు వందరూపాయలు పెట్టి కూరగాయలు కొంటే... అందులో రైతుకు దక్కిన వాటా రూ.35 మాత్రమే. మిగిలిన రూ.65 దళారులు, రిటైలర్లు దక్కించుకుంటున్నారు. రైతు పంట పొలం నుంచి మార్కెట్‌కు తెచ్చి... చివరగా వినియోగదారుడు కొనే వరకు ఉండే సప్లై చెయిన్, వ్యాల్యూ చెయిన్ సిస్టమ్ సరిగ్గా లేదని ఆర్బీఐ నిపుణుల బృందం గుర్తించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ రిసెర్చ్ విభాగం ఓ నివేదికలో వెల్లడించింది.
రైతు బజార్‌లో కూరగాయల ధరలు తక్కువ! బయటి మార్కెట్‌లో సహజంగానే రేటు ఎక్కువ! రైతు బజార్‌కు, బయటి మార్కెట్‌కూ మధ్య తేడా గరిష్ఠంగా ఎంత ఉండాలి? ఈ ధరలను నియంత్రించాల్సిందెవరు? నిత్యావసరాలైన కూరగాయల ధరలపై మార్కెటింగ్ శాఖ రోజూ వారీ పర్యవేక్షణ చేస్తే.. రైతు, దళారులు, రిటైలర్‌ల ‘ధర’ హాసాలు తెలుస్తాయి. కానీ... మార్కెటింగ్ శాఖ కేవలం రైతు బజార్లలో ధరలను నిర్ణయించడంతోనే సరిపెడుతోంది.