ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్, ప్రశ్నాపత్రాల ప్రమాణీకరణపై వర్క్‌షాప్


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP), NCERT పరిధిలోని PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) సంయుక్తంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ (HPC) రూపకల్పన, ప్రశ్నాపత్రాల ప్రమాణీకరణ (Standardization of Question Paper Templates) పై ఐదు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) దిశలో పాఠశాల విద్యలో సమగ్ర మూల్యాంకన విధానాలను అమలు చేసేందుకు చేపట్టిన ఈ వర్క్‌షాప్ 2025 ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు జరిగింది.

పరఖ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & NCERT హెడ్ ప్రొఫెసర్ ఇంద్రాణి భాదురి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. NEP-2020 ప్రకారం రాష్ట్ర బోర్డులు సమాన విద్యా ప్రమాణాలను అమలు చేయడంలో చూపిస్తున్న కృషిని ప్రశంసించారు. విద్యార్థులలో ఆలోచనాశక్తి, నైపుణ్యాలను ప్రోత్సహించే ప్రశ్నాపత్రాల రూపకల్పనకు ఈ వర్క్‌షాప్ దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రారంభ కార్యక్రమాన్ని 25 ఫిబ్రవరి 2025 న శ్రీ విజయ రామ రాజు వి, I.A.S., డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, A.P. శ్రీ బి. శ్రీనివాసరావు, I.A.S., స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్షా, A.P. ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, A.P. మాట్లాడుతూ – విద్యార్థుల సామర్థ్యాల ఆధారిత మూల్యాంకనానికి రాష్ట్రంలో మార్గదర్శక విధానాలను రూపొందించేందుకు ఈ కార్యక్రమం కీలకమని తెలిపారు.

వర్క్‌షాప్ ముఖ్యాంశాలు:
 • హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్‌కు అనుగుణంగా మూల్యాంకన విధానాల రూపకల్పన
 • రాష్ట్ర ప్రశ్నాపత్రాల విశ్లేషణ & డీకన్స్ట్రక్షన్
 • ప్రశ్నాపత్రాల బ్లూప్రింట్ రూపకల్పన
 • నైపుణ్య ఆధారిత ప్రశ్నలు రూపొందించేందుకు తగిన మార్గదర్శకాలు
 • మోడల్ ప్రశ్నాపత్రాల రూపకల్పన

ఈ శిక్షణలో PARAKH, NCERT నిపుణులు, రాష్ట్రంలోని 100 మంది ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, SCERT, సమగ్ర శిక్షా , బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు పాల్గొన్నారు.

3×3 రూబ్రిక్-బేస్డ్ అసెస్‌మెంట్ విధానం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను బేసిక్, ప్రొఫిషియంట్, అడ్వాన్స్‌డ్ స్థాయిలుగా విభజించి సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేయనున్నారు. తరగతి చర్చలు, గుంపు ప్రాజెక్టులు, వ్యక్తిగత పరిశోధనలు వంటి చర్యల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది.

ఈ వర్క్‌షాప్ ద్వారా రాష్ట్ర ఉపాధ్యాయులకు నూతన మూల్యాంకన విధానాలపై అవగాహన కల్పించడంతోపాటు, భవిష్యత్తు బోర్డు పరీక్షల కోసం ప్రశ్నాపత్రాల రూపకల్పనలో నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.