ANDRAPRADESH, AMARAVATHI: బిగ్ బాస్ అన్న పదానికి పొలిటికల్ డిక్షనరీలో చాలా పెద్ద అర్ధమే ఉంది. పైగా అది ఎంతో స్ట్రాంగ్ వర్డ్ అని చెప్పాలి. సాధారణంగా పాలిటిక్స్ లో బాసులు ఉంటారు. బిగ్ బాసులు అంటే అది పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ నే ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది. అపుడెపుడో ఉమ్మడి ఏపీలో ఒకసారి అసెంబ్లీలో నాటి నాయకుడు మైసూరారెడ్డి బిగ్ బాస్ అన్న పదం వాడినట్లుగా అంతా చెప్పుకున్నారు. అది ఎవరి మీద ఆయన వాడారో వారికి బాగా తగిలింది అని మీడియా రాసింది. అలా నాటి బిగ్ షాట్స్ భుజాలు తడుముకున్నారు.
ఇపుడు ఇన్నేళ్ళ తరువాత ఏపీ రాజకీయాల్లో మరోసారి బిగ్ బాస్ అన్న పదం కనిపిస్తోంది. కొంతకాలంగా బిగ్ బాస్ చుట్టూనే పాలిటిక్స్ సాగుతోంది. అది కూడా లిక్కర్ స్కాం విషయంలో. వైసీపీ అయిదేళ్ళ పాలనలో లిక్కర్ స్కాం పెద్ద ఎత్తున సాగిందని, ఏకంగా మూడు వేల కోట్లకు పైగా స్కాం ఇందులో ఉందని ప్రచారం సాగుతోంది. డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు చెల్లింపులు చేయడం అలాగే నాసి రకం మద్యాన్ని విక్రయించడం, అదే విధంగా కొత్త బ్రాండ్లను తీసుకుని రావడం ఇలా చాలానే లిక్కర్ విషయంలో ఉన్నాయని గత ప్రభుత్వం మీద కూటమి నేతలు అపుడు ఆరోపణలు పెద్ద ఎత్తున చేశారు. ఇపుడు చూస్తే అదే లిక్కర్ స్కాం అనడానికి ఆధారంగా మారుతోంది.
ఇక ఏపీలో లిక్కర్ స్కాం విచారణ మెల్లగా మొదలై పీక్స్ కి చేరుకుంటోంది. నెమ్మదిగా బడా నాయకుల మీదనే దర్యాప్తు వెళ్తోంది. అరెస్టులు చూస్తే ఈ కేసులో చాలానే జరిగేట్టుగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు అరెస్టు అవుతారు ఎవరు ముందు ఎవరు తరువాత అన్న చర్చ కూడా సాగుతోంది. దాంతో పాటుగా ఈ కేసులో మూలవిరాట్టులు ఉన్నారని వారిని పట్టుకుని అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్న వారు ఉన్నారు. మరి బిగ్ షాట్స్ ఎవరూ అన్న చర్చ ఒక వైపు ఉండగానే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లిక్కర్ స్కాంలో బిగ్ బాస్ ని అరెస్ట్ చేయాలంటూ కీలకమైన ప్రకటన చేసారు.
లిక్కర్ స్కాంలో వారినీ వీరినీ కాదు బిగ్ బాస్ ని ముందు అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ దురాశ వల్లనే నాసిరకం మద్యం అమ్మకాలు జరిగాయని అన్నారు. అతి పెద్ద దోపిడీగా ఆయన అభివర్ణించారు. సీబీఐ ఈడీ రంగంలోకి దిగాలని ఆయన అంటున్నారు. పైగా ఇది మూడు వేల కోట్ల స్కాం కాదని ఏకంగా పదివేల కోట్ల స్కాం జరిగింది అని సోమిరెడ్డి తేల్చేశారు.
సోమిరెడ్డి చాలా సీరియస్ ఆరోపణలే చేశారు. అవన్నీ ఇపుడు మంట పుట్టించేలా ఉన్నాయి. అసలే లిక్కర్ స్కాం మీద రాజకీయ రాద్ధాంతం రోజు రోజుకీ అధికం అవుతోంది. వైసీపీ నేతలలో గుబులు రేగుతోంది అని అంటున్నారు. అంతే కాదు ఈ స్కాం లో బడా వ్యక్తుల ప్రమేయం ఉందని చెబుతున్నారు. ఉన్నట్లుండి సోమిరెడ్డి బిగ్ బాస్ అని ఒక పెద్ద ఆరోపణ చేశారు.
ఆ బిగ్ బాస్ ఎవరు అన్నదే చర్చగా ఉంది. సోమిరెడ్డి పేరు చెప్పలేదు. కానీ వేలు పెట్టి చూపుతున్నారు. ఆయన చెప్పిన పేరు ఎవరిదో అందరికీ చూచాయగా అర్ధం అవుతోంది. కానీ ఆ పేరుని ఆయన చెప్పకుండానే ఎవరో అన్నది హింట్ ఇస్తున్నారు. సీబీఐ ఈడీలు చేయాల్సిన భారీ కుంభకోణం అంటున్నారు. మరి ఇన్ని చెప్పిన ఆయన బిగ్ బాస్ పేరు చెప్పడం మరచారా అనుకోవడానికి లేదు. వ్యూహాత్మకంగానే ఆయన అలా అంటున్నారు. ఇంతకీ బిగ్ బాస్ ఎవరు అంటే జవాబు అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందా ఏమో.