INDIA NEWS: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఎఫ్-1 వీసా ఇంటర్వ్యూల తర్వాత అనేక మంది విద్యార్థుల CEAC (Consular Electronic Application Center) స్టేటస్ "రెఫ్యూస్డ్" అని కనిపిస్తోంది. ఇది విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. అయితే, ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, వీసా అధికారులు పాస్‌పోర్ట్‌లను తమ వద్ద ఉంచుకుంటున్నారు. కానీ ఎటువంటి 221(g) స్లిప్‌ను ఇవ్వడం లేదు. స్పష్టమైన తిరస్కరణ కూడా ఉండటం లేదు. దీనికి తోడు "సోషల్ మీడియా స్క్రీనింగ్ చేయాలి" అనే సమాధానం విద్యార్థులను మరింత అయోమయంలో పడేస్తోంది.
-ముంబై కన్సులేట్ వద్ద సంఘటన
జూలై 1న ముంబై కన్సులేట్‌లో ఇంటర్వ్యూకు హాజరైన ఒక విద్యార్థి అనుభవం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంటర్వ్యూ అయిన వెంటనే CEAC స్టేటస్ "Refused"గా మారిందని అతను వెల్లడించాడు. అధికారిని దీని గురించి ప్రశ్నించగా, "మీ సోషల్ మీడియాను స్క్రీన్ చేయాలి" అని బదులిచ్చారట. కానీ ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది, ఎలాంటి సమాచారం అవసరం వంటి వివరాలు ఏవీ ఇవ్వలేదు. ఇది వీసా నిరాకరణ కానప్పటికీ, "Refused" అనే పదం CEAC రికార్డులో కనిపించడం వల్ల విద్యార్థుల్లో భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళన నెలకొంది.
-ఇది ఏ ఒక్కరి సమస్య కాదు!
ఇలా "Refused" అని స్టేటస్ మారిన విద్యార్థి ఈ ఒక్కరే కాదు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. ఇంటర్వ్యూ అనంతరం CEACలో "Refused" అని చూపిస్తుండగా, పాస్‌పోర్ట్‌లు మాత్రం అధికారుల వద్దే ఉంటున్నాయి. వీసా నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది "అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్"లో భాగంగా జరుగుతోంది. అయితే ఈ ప్రక్రియ గురించి చాలా మంది విద్యార్థులకు ముందే అవగాహన ఉండకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు.
- సోషల్ మీడియా స్క్రీనింగ్.. ట్రంప్ పాలన నిబంధనల ప్రభావమా?
ఈ కొత్త విధానం ట్రంప్ పరిపాలనలో ప్రవేశపెట్టిన సోషల్ మీడియా పరిశీలన నిబంధనల ఫలితంగా కనిపిస్తోంది. గతంలో ఎఫ్-1 వీసాలు సాధారణంగా ఇంటర్వ్యూ తర్వాత కొన్ని రోజుల్లోనే క్లియర్ అయ్యేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా స్క్రీనింగ్ కారణంగా వీసా దరఖాస్తులు చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉంచబడుతున్నాయి.
- కారణం ఏమిటి? ఎవరి పోస్టులు ప్రమాదకరం?
ప్రస్తుతం విద్యార్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తూ ఊహాగానాల్లో మునిగిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పబ్లిక్‌గా ఉండటం వల్లా? గతంలో షేర్ చేసిన ఏదైనా మీమ్ వల్లా? నలుగురికి కనిపించేలా పోస్ట్ చేసిన వ్యాఖ్యల వల్లా? వీసా సాధనకు అవసరమైన ప్రొఫైల్‌ను ఏదైనా అపరిచితమైన పోస్టు దెబ్బతీసిందా? వంటి ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి.
-స్పష్టత కొరవడి.. భయం పెరుగుతోంది
ఈ పరిస్థితులన్నీ కలిసి, విదేశాల్లో విద్య కోసం అమెరికాను ఎంచుకున్న భారతీయ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. అమెరికా వీసా ప్రక్రియలో వచ్చిన ఈ మార్పు, విద్యార్థుల జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఇది మరోసారి నిరూపిస్తోంది. వీసా స్టేటస్ "Refused" అని చూపించబడటం తాత్కాలికమే కావచ్చు. కానీ ఈ అస్పష్టతతో కూడిన ప్రక్రియ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర భయాన్ని కలిగిస్తోంది. అమెరికా దౌత్య శాఖ ఈ ప్రక్రియకు సంబంధించిన స్పష్టతను ఇవ్వడం, విద్యార్థులకు ముందస్తు అవగాహన కల్పించడం అత్యవసరం.