కామనగరువులో రోడ్డు ప్రమాదం.... ఒకరు మృతి... మరొకరి ప్రాణాలు కాపాడిన స్థానికులు...


అమలాపురం రూరల్: మండలం కామనగరువు మెయిన్ విలేజ్ మాజీ సర్పంచ్ రాజులపూడి వెంకటేశ్వరరావు నివాస గృహ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలు పాలైన మరో వ్యక్తిని స్థానికులు రక్షించారు. అతన్ని 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ఉప్పలగుప్తం మండలం చీకట్లవారిపాలెంకు చెందిన గోలకోటి రమేష్ అతని బంధువు శేఖర్ కలిసి మోటార్ సైకిల్ పై తాటిపాక ఒక వివాహ కార్యక్రమానికి వెళ్లారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఆ పెళ్ళిలోనే ఉన్నారు. 

అయితే పెళ్లి తెల్లవారుజామున కావడంతో భోజనం చేసిన తర్వాత తిరిగి ఆ ఇద్దరు మోటర్ సైకిల్ పై స్వగ్రామైన చీకట్లవారిపాలెంకు బయలుదేరారు. కామనగరువు మాజీ సర్పంచ్ రాజులపూడి వెంకటేశ్వరరావు నివాస గృహం వద్దకు వచ్చేసరికి అక్కడే ఉన్న పంట బోదెకు రక్షణ గోడ లేకపోవడంతో అదుపుతప్పి సరాసరి మోటార్ సైకిల్ తో సహా బోదెలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటన అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరిగింది. అర్ధరాత్రి కావడంతో ఎవరు గమనించలేకపోయారు. కానీ కుక్కలు పదేపదే అరవడంతో దొంగల బెడద కారణంగా ఆ పక్కనే ఉన్న రాజులపూడి భాస్కరరావు కుటుంబ సభ్యులు లేచారు. పంట బోదె వద్దే కుక్కలు అరవడంతో అక్కడ చూసేసరికి మోటార్ సైకిల్, ఇద్దరు వ్యక్తులు బోదెలో పడిపోయి ఉన్నారు. వెంటనే స్పందించి వారిని కాపాడుతూనే ఒకవైపు 108 మరోవైపు పోలీసులకు సమాచారం అందించారు. 

గొల్లకోటి రమేష్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న శేఖర్ అనే వ్యక్తిని స్థానికులు బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఇంతలో 108 అక్కడికి చేరుకుని తీవ్రగాయాల పాలైన శేఖర్ ను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు మృతి చెందిన రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుపున్న కుటుంబ సభ్యులు అక్కడ చేరుకుని బోరున విలపించారు. పంట బోదెకు కల్వర్టు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. విషయాన్ని ఎన్నిసార్లు పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదంటూ స్థానికులు కూడా అధికారుల తీరుపై మండిపడుతున్నారు.