కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు.. ఏలూరు ఎంపీ



రాష్ట్రంలో యువతకు పెరిగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ను గెలిపించండి.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.

ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాజధాని అమరావతి, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎమ్మెల్యే బడేటి చంటి, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తో కలిసి శనివారం ఏలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.



ఏలూరు సీ.ఆర్.రెడ్డి విద్యాసంస్థలకు వెళ్లి ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఓట్ల అభ్యర్థించారు. అనంతరం ఏలూరులోని అతిధి హోటల్ లో ఏ.పీ.పీ.యూ.ఎస్.ఎం.ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యావంతుల సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకురాలు ఆచంట సునీతతో కలసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా 8 నెలల కాలంలో రాష్ట్రానికి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయని తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎంపీ వెల్లడించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎంపీ మహేష్ కుమార్ కోరారు. అనంతరం నమూనా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేసి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్, పరిశీలకురాలు ఆచంట సునీత, తదితరులు మాట్లాడారు.