WORLD NEWS: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కేసు ఇప్పుడు శ్రీలంకకు పాకింది. చెన్నై నుండి కొలంబో వెళ్లిన ఒక ఫ్లైట్‌లో పహల్గామ్ దాడికి సంబంధించిన అనుమానితుడు ఉండవచ్చనే సమాచారం రావడంతో శ్రీలంక పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కొలంబోలోని బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆ ఫ్లైట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆ ఫ్లైట్ ఉదయం 11:59 గంటలకు కొలంబో చేరుకోగానే పెద్ద ఎత్తున భద్రతా తనిఖీలు నిర్వహించారు. పహల్గామ్ దాడి అనుమానితుడు ఫ్లైట్‌లో ఉన్నాడనే వార్తతో ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది.
శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ తన ప్రకటనలో.. "చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి మాకు ఒక అలర్ట్ వచ్చింది. వెంటనే మేము స్థానిక అధికారులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాము. భారతదేశంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఒక అనుమానితుడు ఆ విమానంలో ఉండవచ్చని మాకు సమాచారం అందింది. మేము విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాము. తనిఖీల తర్వాత విమానాన్ని తదుపరి కార్యకలాపాల కోసం క్లియర్ చేశాము." ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు అత్యంత ముఖ్యమని, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది.
పహల్గామ్ దాడి చేసింది వీళ్లేనా?
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో భారత ప్రభుత్వం, భద్రతా సంస్థలు అనేక మంది ఉగ్రవాదులను గుర్తించాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. ఈ దాడిలో నలుగురు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తేలింది. వీరిలో కొందరిని గుర్తించారు. భద్రతా సంస్థలు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా అనే ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశాయి. దీనితో పాటు ఆదిల్ హుస్సేన్ ఠోకర్, ఆసిఫ్ షేక్ అనే ఇద్దరు స్థానిక ఉగ్రవాదులను కూడా గుర్తించారు. ఆదిల్ అనంతనాగ్‌కు చెందినవాడు. 2018లో పాకిస్తాన్‌కు వెళ్లి ఉగ్రవాద ట్రైనింగ్ పొందాడు.
పహల్గామ్ దాడికి పాల్పడిన ఇతర ఉగ్రవాదులను హాషిమ్ మూసా (పాకిస్తాన్ ఆర్మీ మాజీ కమాండో), అలీ భాయ్ (పాకిస్తాన్ జాతీయుడు)గా గుర్తించారు. ఈ దాడికి సూత్రధారి లష్కర్-ఎ-తైబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఖలీద్ అని భావిస్తున్నారు. ఇతను పాకిస్తాన్‌లో చురుకుగా ఉన్నాడు. దీనితో పాటు ఈ దాడికి సహాయం చేసినట్లు అనుమానిస్తున్న 15 మంది స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్లను (OGW) గుర్తించారు. వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర నిఘా సంస్థలు ఉగ్రవాదులు, వారి నెట్‌వర్క్‌ను పట్టుకోవడానికి విస్తృతమైన గాలింపు చర్యలు చేపడుతున్నాయి.