WORLD, INDIA NEWS: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పహల్ గాం దాడిలో 26 మంది భారతీయులు మరణించారు. ఈ క్రమంలోనే యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.. పహల్ గాం దాడి జరిగిన వెంటనే, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలసి పూర్తి మద్దతు ప్రకటించారు. కాశ్మీర్ విషయంలో కూడా పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని టర్కీ పునరుద్ఘాటించింది. దీనిని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
దీనికి తోడు, టర్కీ నావికా యుద్ధనౌక "స్నేహ సందర్శన" పేరుతో కరాచీ ఓడరేవుకు చేరుకుంది. అయితే ఇది కేవలం స్నేహపూర్వక పర్యటన కాదని సైనిక నిపుణులు అంటున్నారు. ఈ యుద్ధనౌక క్షిపణులు, టార్పెడోలు, జలాంతర్గామి వ్యతిరేక వ్యవస్థలతో కూడి ఉంది. ఇది స్పష్టమైన సైనిక బలాన్ని సూచిస్తుంది. భారతదేశం కరాచీపై నావికా దిగ్బంధనం విధించే అవకాశాన్ని చర్చిస్తున్న సమయంలో ఈ పర్యటన జరగడం, ఒక హెచ్చరిక సంకేతంగా కనిపిస్తోంది.
అదే సమయంలో టర్కీ సైనిక రవాణా విమానాలు సుమారు ఆరు ఉన్నాయని అవి పాకిస్తాన్‌లో దిగాయని నివేదికలు సూచిస్తున్నాయి.. అధికారికంగా టర్కీ ఇంధనం నింపుకోవడానికే అని పేర్కొంది. ఆయుధాలు తీసుకురాలేదని ఖండించింది. అయితే పాకిస్తాన్ మీడియాలో వస్తున్న అనధికారిక నివేదికలు ఈ విమానాలలో సైనిక సామాగ్రి వచ్చి ఉండవచ్చని సూచిస్తున్నాయి. నిజం ఏమిటనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ సందర్శనల సమయం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
టర్కీ, పాకిస్తాన్‌లు ఇప్పటికే బలమైన రక్షణ సంబంధాలను కలిగి ఉన్నాయి. టర్కీ పాకిస్తాన్‌కు అధునాతన డ్రోన్‌లను సరఫరా చేసింది. పాకిస్తాన్ F-16లను అప్‌గ్రేడ్ చేసింది. పాకిస్తాన్ కోసం యుద్ధనౌకలను నిర్మించింది. పశ్చిమ దేశాలు పాకిస్తాన్‌తో సైనిక వాణిజ్యాన్ని పరిమితం చేస్తున్న నేపథ్యంలో, టర్కీ కీలక ఆయుధ సరఫరాదారుగా మారింది.
ఈ పరిణామాలు టర్కీ-పాకిస్తాన్ సంబంధాల లోతును అలాగే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో టర్కీ పాత్రను స్పష్టం చేస్తున్నాయి.