WORLD, INDIA NEWS: జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై భారత్ నిర్మించిన బగ్లిహార్ ఆనకట్ట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల పహల్గాం దాడి తర్వాత, సింధు జల ఒప్పందంపై తాత్కాలిక చర్యలను భారత్ నిలిపివేస్తుందని సంకేతాలు ఇవ్వడంతో తమకు రావాల్సిన నీటిని భారత్ తనవైపు మళ్లించుకుంటుందేమోనని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో బగ్లిహార్ ఆనకట్ట గేట్లన్నీ మూసి ఉన్నట్లు వార్తలు, వీడియోలు వెలువడుతున్నాయి.
సింధు జల ఒప్పందంపై తాత్కాలిక నిలిపివేత తర్వాత ఈ ఒప్పందంలో భాగంగా ఉన్న ఆనకట్టపై భారత్ ఏదైనా పని ప్రారంభించడం ఇదే తొలిసారి అని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఉత్తర కశ్మీర్‌లోని జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ఆనకట్ట గేట్లను కూడా ఇలాగే మూసేయాలని భారత్ భావిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. బగ్లిహార్, కిషన్‌గంగా రెండూ జలవిద్యుత్ ప్రాజెక్టులు కావడం వల్ల నీటి విడుదల సమయాన్ని నియంత్రించే అధికారం భారతదేశానికి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
-పాకిస్తాన్ భయం - జల యుద్ధం హెచ్చరిక
ఈ పరిణామాలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారతదేశం పాకిస్తాన్‌కు వచ్చే నీటిని నిలిపివేయడానికి లేదా మళ్లించడానికి ప్రయత్నిస్తే, దానిని యుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించారు. "యుద్ధం అంటే కేవలం ఫిరంగి గుండ్లు లేదా తుపాకులను కాల్చడమే కాదు. దీనికి అనేక రూపాలు ఉన్నాయి. నీటిని నిలిపేయడం కూడా యుద్ధం కిందికే వస్తుంది" అని ఆయన అన్నారు. దీనివల్ల దేశ ప్రజలు ఆకలితో లేదా దాహంతో చనిపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
- బగ్లిహార్ ఆనకట్ట వివాదం ఎందుకు?
బగ్లిహార్ ఆనకట్ట భారత్-పాక్ మధ్య దీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉంది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జల ఒప్పందం ప్రకారం, సింధు నది - దాని ఉపనదుల నీటి వినియోగాన్ని రెండు దేశాలు పంచుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారతదేశానికి పూర్తి హక్కు ఉంది. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాల్లో ఎక్కువ భాగం (80%) పాకిస్తాన్‌కు కేటాయించబడింది. అయితే, ఈ పశ్చిమ నదులపై భారత్‌కు జలవిద్యుత్ ఉత్పత్తి వంటి పరిమిత వినియోగ హక్కులు ఉన్నాయి.
జమ్మూలోని రాంబన్‌లో చీనాబ్ నదిపై నిర్మించిన 900 మెగావాట్ల బగ్లిహార్ జలవిద్యుత్ ప్రాజెక్టు డిజైన్‌పై పాకిస్తాన్ 1992 నుంచే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1999లో ప్రారంభమై 2008లో పూర్తయింది. ఆనకట్ట రూపకల్పన సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని, పాకిస్తాన్‌కు చేరే నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుందని పాక్ ఆరోపించింది. ఈ విషయంలో పాకిస్తాన్ గతంలో ప్రపంచ బ్యాంకు జోక్యాన్ని కోరింది, అనేకసార్లు చర్చలు జరిగాయి.
-గేట్లు ఎందుకు మూసి ఉన్నాయి?
బగ్లిహార్ ఆనకట్ట గేట్లను మూసివేయడంపై హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఒక నివేదిక ఇచ్చింది. రిజర్వాయర్ నుంచి బురదను తొలగించడానికి గేట్లను మూసివేశారని, దీనివల్ల పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహం 90 శాతం తగ్గిందని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) అధికారి ఒకరు తెలిపినట్లు ఆ నివేదిక పేర్కొంది. బురద తొలగింపు తర్వాత రిజర్వాయర్‌ను మళ్లీ నీటితో నింపే పని ప్రారంభమైందని మరో అధికారి తెలిపారు. రిజర్వాయర్‌ను పూడిక తీసి, నీటిని నింపే ప్రక్రియ సాధారణంగా ఉత్తర భారతదేశంలోని ఆనకట్టలపై ఆగస్టు నెలలో జరుగుతుందని, అయితే ఈసారి ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ది ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. మే నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే జలాశయాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.
-పాకిస్తాన్ దేనికి భయపడుతోంది?
బగ్లిహార్ ఆనకట్టను ఉపయోగించి నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు భారత్ తమకు నీటిని నిలిపివేయగలదని, అధికంగా ఉన్నప్పుడు విడుదల చేయగలదని పాకిస్తాన్ ప్రధాన భయం. అంటే, భారత్ నీటి ప్రవాహాన్ని నియంత్రించే శక్తిని కలిగి ఉంటుందని పాక్ ఆందోళన చెందుతోంది. అయితే పాకిస్తాన్ భయాలను పూర్తిగా తొలగించే పరిష్కారం తమ దగ్గర లేదని భారత్ పేర్కొంటోంది. ఆనకట్ట నిర్మాణంపై 1999లో ఒప్పందం కుదిరినా, పాకిస్తాన్ నిరంతరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రాజెక్టుల వల్ల తమకు నీటి ప్రవాహం తగ్గుతుందని పాక్ ఆందోళన చెందుతోంది.
- భారత్ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
బగ్లిహార్ మాత్రమే కాకుండా, భారత్ చీనాబ్ నది, దాని ఉపనదులపై అనేక ఇతర జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. పాకల్ దుల్ (1000 మెగావాట్స్), కిరు (624 మెగావాట్స్), క్వార్ (540 మెగావాట్స్), రాట్లే (850 మెగావాట్స్) ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి 2027-28 నాటికి పూర్తవుతాయని అంచనా. వీటిని NHPC , జమ్మూకశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పాకల్ దుల్ వద్ద 66%, కిరు వద్ద 55%, క్వార్ వద్ద 19%, రాట్లే వద్ద 21% పనులు పూర్తయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. రాట్లే, కిషన్‌గంగా ప్రాజెక్టుల డిజైన్లు సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని పాకిస్తాన్ వీటిని కూడా వ్యతిరేకిస్తోంది. బగ్లిహార్ తో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టుల మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 3,014 మెగావాట్లు. ఈ ప్రాజెక్టుల నుంచి ఏటా 10,541 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా.
జమ్మూకశ్మీర్‌కు 18,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, అందులో 11,823 మెగావాట్లు చీనాబ్ బేసిన్ నుంచే వస్తుందని తెలుస్తోంది. మొత్తంగా, బగ్లిహార్.. ఇతర జలవిద్యుత్ ప్రాజెక్టులు భారత్‌కు విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకమైనవి కాగా, అవి సింధు జల ఒప్పందం.. పాకిస్తాన్ నీటి భయాల నేపథ్యంలో నిరంతర ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి.