సరదా కోసం కొండెక్కితే.. కోట్ల నిధి దొరికింది..


WORLD NEWS: చెక్‌ రిపబ్లిక్‌లోని సుందరమైన పోడ్కర్కోనోసి పర్వతాల్లో ఇటీవల ఇద్దరు పర్యాటకులు హైకింగ్‌ చేస్తూ వెళ్లారు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుదామని పర్వతం పైకి హైకింగ్‌కు వెళ్లిన ఇద్దరు ఔత్సాహికులకు ఊహించని అదృష్టం వరించింది. చెక్ రిపబ్లిక్‌లోని ఈశాన్య పర్వత ప్రాంతాల్లో వారికి కోట్లాది రూపాయల విలువైన నిధి లభించింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన వెలుగు చూసింది.


చెక్‌ రిపబ్లిక్‌లోని సుందరమైన పోడ్కర్కోనోసి పర్వతాల్లో ఇటీవల ఇద్దరు పర్యాటకులు హైకింగ్‌ చేస్తూ వెళ్లారు. అలా వెళ్తుండగా వారికి ఒక ప్రాంతంలో 598 బంగారు నాణేలు, విలువైన ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించాయి. ఒక్కసారిగా అన్నింటినీ చూసిన ఆ పర్యాటకులు ఆశ్చర్యంతో నివ్వెరపోయారు.

వెంటనే వారు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. ప్రస్తుతం ఈ నిధి మొత్తం ఈస్ట్ బొహెమియన్‌ మ్యూజియంలో భద్రపరచబడింది. ఈ అద్భుతమైన ఆవిష్కరణ ఫిబ్రవరి నెలలో జరిగినప్పటికీ, మ్యూజియం అధికారులు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారు నాణేలు సుమారు 1808 కాలం నాటివిగా గుర్తించారు. ఈ నాణేలు ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్‌ సామ్రాజ్యం వంటి వివిధ ప్రాంతాలకు చెందినవిగా నిర్ధారించారు. వీటిని 1921 తర్వాత, బహుశా సుమారు వంద సంవత్సరాల క్రితం ఏదైనా అనిశ్చిత పరిస్థితుల్లో భూమిలో దాచిపెట్టి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మ్యూజియం ఉన్నతాధికారి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ, "హైకర్స్ ఆ సంపదను మాకు చూపించినప్పుడు నేను తీవ్రంగా ఆశ్చర్యపోయాను. వీటిని ఇంకా సమగ్రంగా విశ్లేషించాల్సి ఉంది. అయితే, ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ విలువైన లోహాల విలువ దాదాపు రూ.2.87 కోట్లు (340,000 డాలర్లు) ఉండవచ్చు" అని తెలిపారు. విలువైన వస్తువులను నిధుల రూపంలో భూమిలో దాచిపెట్టడం అనేది చరిత్రపూర్వ కాలం నుంచి ఉన్న ఆచారమేనని, అనిశ్చిత పరిస్థితుల్లో భద్రత కోసం దాచి, తర్వాత తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు ఈ నిధిని దాచి ఉండవచ్చనే వాదన కూడా ప్రచారంలో ఉంది.

కాగా చెక్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం, ఇలాంటి నిధులు లభించినప్పుడు, వాటి విలువలో పది శాతం వరకు నిధిని కనుగొన్న వ్యక్తులకు లభించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రకృతిని ఆస్వాదిద్దామని వెళ్లిన వారికి ఈ విధంగా కోట్లలో నిధి లభించడం నిజంగా అపూర్వమైన సంఘటన అని చెప్పవచ్చు.