5 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ వివరాలు నమోదు పూర్తిచేయాలి: కలెక్టర్ కె. వెట్రిసెల్వి


*15 నుంచి 17 సంవత్సరాల మధ్యవయస్సు గలవారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి

*జిల్లాస్ధాయి ఆధార్ మోనాటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ANDRAPRADESH, ఏలూరు: జిల్లాలో 5 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ వివరాలు నమోదును పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లాస్ధాయి ఆధార్ మోనాటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. 

ఈ సందర్బంగా ఆధార్ ఎన్ రోల్ మెంట్, ఆధార్ బయోమెట్రిక్, అప్ డేట్ అంశాలపై సమీక్షించారు. ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 5 సంవత్సరాలోపు మరియు 15-17 వయస్సు ఉన్న విద్యార్ధులకు ఆధార్ బయోమెట్రిక్ నవీకరణల అవసరాన్ని నొక్కిచెప్పారు. నీట్, జెఈఈ వంటి జాతీయ ప్రవేశ పరీక్షల్లో సజావుగా నవీకరణ ఉండేలా, సమస్యలను నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

ఆధార్ కార్డుల నవీకరణ పెండింగ్ ప్రక్రియపై దృష్టిసారించాలన్నారు. గడిచిన 30 రోజుల్లో జిల్లా పరిధిలో 57,481 ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ జరిగిందన్నారు. ఆధార్ నవీకరణ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో, అనాధ శరణాయాల్లో ఉన్న పిల్లల ఆధార్ ఎన్ రోల్ మెంట్ లో వచ్చే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. 

ఈ విషయంపై ఐసిడిఎస్ పిడి సంబంధిత వివరాలను ఉదయ్ సంస్ధ అధికారులకు అందజేయాలన్నారు. సరైన ఆధార్ గుర్తించడంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలియజేసే వివరాలను కరపత్రాల రూపంలో ప్రచురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఉదయ్ సంస్ధ అసిస్టెంట్ మేనేజరు జి. గిరిధర్, జెడ్పి సిఇఓ భీమేశ్వరరావు, ఎల్డిఎం డి. నీలాధ్రి, ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్, సోషల్ వెల్పేర్ జెడి జయప్రకాష్, డ్వామా పిడి సుబ్బారావు, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి పి.శారద ,ఆర్.ఐ.ఓ. యోహాన్, పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.