ఏలూరు: అవసరార్థులకు అందించే సాయం అత్యంత ఆనందాన్ని కలిగిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు కోటి 50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందించినట్లు వెల్లడించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏలూరు అసెంబ్లీ నియోజవర్గంలోని 12 మంది బాధితులకు విడుదలైన 4 లక్షల 37వేల 959 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్యసేవలతో పేదవారికి పూర్తి భరోసా కల్పించామన్నారు. దాంతోపాటూ ఉచిత వైద్యసేవల్లోకి రాని వాటికి సైతం ఆర్ధిక సాయం అందించి, బాధితుల్లో భరోసా నింపేందుకు కూటమి ప్రభుత్వాధినేతలు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అవసరార్ధులకు సాయం అందిస్తున్నారన్నారు.
అతితక్కువ కాలంలోనే కోటి 50 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని ఏలూరు నియోజకవర్గంలోని బాధితులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వం దక్కించుకుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే తానిచ్చిన నినాదాన్ని అందుకున్న అనేక మంది దాతలు సేవా కార్యక్రమాలకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. తాజాగా ఏలూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దివ్వెల జయబాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వేమా కోటేశ్వరరావులు అందించిన 20వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని కూడా ఎమ్మెల్యే ఈ సందర్భంగా బాధితులకు అందించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నగరాధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, నాయకులు బెల్లపుకొండ కిషోర్, నెరుసు గంగరాజు, తంగిరాల సురేష్, మారం అను తదితరులు పాల్గొన్నారు.