ANDRAPRADESH: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ కొడాలి నానికి కాలం ఏ మాత్రం కలిసిరావడం లేదా? అనే చర్చ జరుగుతోంది. By: BCN TV NEWS గుడివాడ నుంచి వరుస విజయాలతో తిరుగులేని నేతగా చెలామణి అయిన కొడాలికి ఏడాది క్రితం ఎదురైన ఓటమితో కష్టాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు కేసుల మీద కేసులతో ప్రభుత్వం వేటాడుతుండగా, మరోవైపు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన కొడాలికి.. ఇప్పుడు సొంత మనుషులు ఝలక్ ఇస్తున్నారు. ఇన్నాళ్లు కొడాలితోనే కలిసినడిచిన వారు వరుసగా గుడ్ బై చెప్పేస్తుండటంతో గుడివాడ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది చర్చకు తావిస్తోంది.
మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరులు ఆయన నుంచి దూరమవుతున్నారు. గుడివాడలో కొడాలికి అత్యంత సన్నిహితుడుగా చెప్పే మైనార్టీ నేత ఖాసిం వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ అధికారంలో లేని సమయంలో ఇలాంటి రాజీనామాలు సహజమైనా, వ్యక్తిగతంగా కొడాలికి మాత్రం తీవ్ర నష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఏ సమావేశం జరిగినా కొడాలి మాట్లాడుతూ ‘‘ఖాసిం నా తమ్ముడు, నా బలం.. ఏ సమస్య ఉన్నా ఖాసింకి చెబితే నాకు చెప్పినట్లే’’ అంటూ కొడాలి చెప్పేవారు. అలాంటి నాయకుడు ఇప్పుడు కష్టకాలంలో కొడాలిని వదిలేయడం చర్చకు దారితీస్తోంది.
గుడివాడలో గట్టి పట్టున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న కొడాలి ఒక్క ఓటమితో మొత్తం రాజకీయమే తలకిందులైందా? అనే అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. మైనార్టీ నేత ఖాసింకి ముందే కొడాలికి ముఖ్య అనుచరుడిగా చెప్పుకున్న ఓ నేత కూడా పార్టీకి దూరమయ్యారని అంటున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలికి బలమైన మద్దతుదారులుగా చెప్పుకున్న వారంతా ఒక్కొక్కరుగా ఆయనకు దూరమవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలా కొడాలి ముఖ్య అనుచరులు ఆయన నుంచి దూరమవడానికి కారణం కూడా కొడాలి వ్యవహారశైలే అంటూ ఆరోపించడం గమనార్హం.
మైనార్టీ నేత ఖాసిం రాజీనామా సందర్భంగా తన నిర్ణయానికి మాజీ మంత్రి కొడాలి వైఖరే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలిలో చాలా మార్పు వచ్చిందని ఆయన నిందించారు. అంతేకాకుండా ఎన్నికలు జరిగిన నుంచి పార్టీని వదిలేశారని విమర్శలు గుప్పించారు. తన తమ్ముడుగా కొడాలి చెప్పుకున్న మైనార్టీ నేత ఖాసిం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన వీడియో వైరల్ అవుతోందని చెబుతున్నారు. అయితే దీనిపై కొడాలి స్పందించాల్సివుంది. ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకుంటున్న కొడాలి గుడివాడ రాజకీయాలపై ఫొకస్ పెంచాల్సివుందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.