జిల్లాలో ఎక్కడా సాగు, త్రాగునీటి సమస్య తలెత్తకూడదు: ఇరిగేషన్ అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
ఏలూరు/ దెందులూరు: నిర్దేశించిన సమయంలోగా ఇరిగేషన్ కాలువలు, చెరువులలో గుర్రపుడెక్క, తూడు, పూడికతీత పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఏలూరు రూరల్, దెందులూరు మండలం సత్యనారాయణపురం, సింగవరం, భీమడోలు మండలం గుండుగొలను, తదితర ప్రాంతాలలోని ఇరిగేషన్ కాలువలు, చెరువులను శనివారం ఇరిగేషన్, రెవిన్యూ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖకు సంబందించిన పనులకు ఎటువంటి నిధుల కొరతా లేదని, గుర్రపుడెక్క, తూడు, పూడికతీత పనులు చేయని కారణంగా సాగు, త్రాగునీటి సమస్య తలెత్తిందన్న ఫిర్యాదు అందితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. నిర్దేశించిన సమయంలోగా ఇరిగేషన్ కాలువలు, చెరువులలో గుర్రపుడెక్క, తూడు, పూడికతీత పనులు పూర్తి అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని, కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్యంగా కారణంగా సమస్యలు తలెత్తితే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని, అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
జిల్లాలో ఎక్కడా సాగు, త్రాగునీటికి ఎటువంటి కొరతా లేకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతంలోని పొలాలకు సాగునీరు, గ్రామాలకు త్రాగునీటి కొరత లేకుండా చూడాలని, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూడు, గుర్రపుడెక్క వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ పనులకు సంబంధించి మంజూరైన పనులకు టెండర్ల ప్రక్రియ వెంటనే పూర్తిచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ కెనాల్స్ నుండి అనధికార సాగునీటి వినియోగం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం సత్యనారాయణపురం, సింగవరం గ్రామాలలో ఇరిగేషన్ కాలువలలో తోడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇరిగేషన్ కెనాల్స్ నుండి అనధికార సాగునీటి వినియోగం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి. నాగార్జునరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనీర్ భానుప్రతాప్, తహసీల్దార్లు సుమతి, రమాదేవి, ఇంజనీర్లు పి. సుబ్రహ్మణేశ్వరరావు, ఎస్. సుబ్రహ్మణ్యేశ్వరరావు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీకృష్ణం రాజు, నీటిపారుదల సంఘాల చైర్మన్ వెలమటి రామచంద్రప్రసాద్, సాగునీటి సంఘాల అధ్యక్షులు చలసాని వెంకట రాంబాబు, నెరుసు వెంకటరమణ, పర్వతనేని రంగారావు, స్థానిక రైతులు, స్థానిక ప్రముఖులు, ప్రభృతులు, కలెక్టర్ వెంట ఉన్నారు.