ANDRAPRADESH: ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇటీవల సాక్షి చానల్‌లో కొమ్మినేని హోస్ట్‌గా నిర్వహించిన డిబేట్‌లో రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజు అమరావతి మహిళలపై అభ్యంతరకర కామెంట్స్ చేశారు. అయితే హోస్ట్‌గా వ్యవహరించిన కొమ్మినేనిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో వుంటున్న ఆయన్ను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో వుంటున్నారు.
కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని మంగళగిరి కోర్టు తప్పు పట్టింది. కొమ్మినేనిపై ఆ సెక్షన్‌ను తొలగించింది. అనంతరం ఆయన్ను రిమాండ్‌కు ఆదేశించింది. బెయిల్ కోసం కొమ్మినేని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొమ్మినేని అరెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది.
నవ్వినంత మాత్రాన కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణలో భాగంగా తాము కూడా నవ్వుతుంటామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధమని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యాన్ని, వాక్ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేస్తూ, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని పోలీసుల్ని ఆదేశించడం గమనార్హం. దీంతో కొమ్మినేని విడుదల కానున్నారు.