గువాహటి: మణిపూర్‌లోని ఇంఫాల్ లోయ పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా.. ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పర్వత ప్రాంత జిల్లాల్లో అడపా దడపా మిలిటెంట్ గ్రూపులకు, భద్రతా దళాలకు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హింసాత్మక పరిస్థితులకు అంకురార్పరణ మాత్రం కొన్ని నెలల నుంచి కొనసాగింది. మైతీ తెగలోకి చేరిన సంఘ్ పరివార్ శక్తులు ప్రస్తుత అల్లర్లకు ఆజ్యం పోసినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ వైఫల్యం, అధికార బీజేపీ విభజన వాదం, ఓట్ల రాజకీయాలు..అన్నీ కలిసి ప్రశాంతమైన ఈశాన్య రాష్ట్రంలో విద్వేషాగ్ని రగిలించాయి. ఇదే అదనుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై 355 అధికరణ ప్రయోగించి తన నియంత్రణలోనికి తెచ్చుకుంది. మొత్తం ఏడు కారణాలు మణిపూర్‌లో మంటలు రేపాయి.
1.మైతీ తెగకు రిజర్వేషన్ల ప్రయత్నం
రాష్ట్ర జనాభాలో 40 శాతంగా ఉన్న కుకీ, నాగా తెగ ప్రజల కన్నా 53 శాతంగా ఉన్న మైతీ తెగ ప్రజల ఓటు బ్యాంకే బీజేపీకి ముఖ్యమైంది. మైతీ తెగకు ఎస్టీ హోదా కల్పించే ప్రయత్నాలు జరగడం గిరిజన తెగలకు, విద్యార్థులకు ఆగ్రహం తెప్పించింది.
2.మిలిటెంట్లతో శాంతి చర్చలు రద్దు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా కుకీ-జోమి మిలిటెంట్ గ్రూపులతో శాంతి చర్చలను మార్చి నెలలో రద్దు చేసుకున్నాయి. దీని ద్వారా గిరిజనులకు స్వయం పాలనను అందించడం మైతీ తెగకు ఇష్టం లేదనే సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసింది.
3.గిరిజనులను వెళ్లగొట్టడం
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షిత అడవుల నుంచి కుకీ, నాగా తెగ గిరిజనులకు వెళ్లగొడుతున్నది. వారికి పునరావాసం కూడా సరిగా కల్పించడం లేదు. దీని వల్ల గిరిజనుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి.
4.చర్చిలపై దాడులు
గిరిజనులను వెళ్లగొట్టే క్రమంలో ప్రభుత్వం మూడు చర్చిలను ధ్వంసం చేసింది. మైతీ తెగకు చెందిన సీఎం బీరేన్ సింగ్ క్రిస్టియన్ మెజారిటీ జనాభా కలిగిన గిరిజనుల ప్రార్థనా స్థలాలపై ఈ చర్యలు చేపట్టడం కూడా అల్లర్లకు ఒక కారణమైంది. కొంత కాలంగా చర్చిలపై కొన్ని మూకలు దాడులు చేస్తున్నాయి. మైతీ తెగలోకి హిందూత్వ గ్రూపులు చొచ్చుకుపోయాయి.
5.క్రైస్తవులు-హిందువుల ఘర్షణగాచిత్రీకరించడం
మైతీ తెగ ప్రజల ఇండ్లను కొందరు దుండగులు దహనం చేశారు. బలవంతంగా బాధితులను భద్రత కోసం వేరే ప్రాంతాలకు వెళ్లేలా చేశారు. దీన్ని క్రైస్తవులు-హిందువుల మధ్య ఘర్షణగా చూపడం వల్ల అనేక మంది అమాయకులు అల్లర్లలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
6.వలసదారులతో భయం సృష్టించారు
మయన్మార్ నుంచి వలస వస్తున్న వారి వల్ల స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కుకీ తెగల మిలిటెంట్ నాయకుడు మయన్మార్ జాతీయుడని బీరేన్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఈ భయాన్ని మరింత పెంచుతున్నది.
7.తీవ్రవాదులపై డ్రగ్స్‌వ్యాపారం ఆరోపణలు
కుకీ తీవ్రవాదులు పాపి(గసాలు) పంటల సాగు చేపట్టి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారని సీఎం బీరేన్ విమర్శించారు. ఇది పూర్తిగా అబద్ధం కాదు. అయితే పర్వత ప్రాంతాల్లో ప్రభుత్వమే డ్రగ్స్ రవాణాకు, డ్రగ్ మాఫియా నాయకులకు మద్దతు ఇస్తున్నదని మాజీ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఆరోపించారు.
విభజన విధానమే హింసకు కారణం: సీపీఐ
న్యూఢిల్లీ: ప్రజలను విభజించే విధానం వల్లే మణిపూర్‌లో హింస చెలరేగిందని, చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరించాలని సీపీఐ కేంద్రానికి సూచించింది. రిజర్వేషన్ల సమస్యను రాజకీయ, సామాజిక సమస్యగా చూడాలని పేర్కొంది. ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని పరిష్కారం కనుగొనాలంది.
అల్లర్లలో 31 మంది మృతి!
బుధవారం నుంచి కొనసాగుతున్న అల్లర్లలో 31 మంది మృతి చెందారని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ సంఖ్యను ప్రభుత్వం ధృవీకరించడం లేదు. 10 వేల మంది సైనికులను రంగంలోకి దింపామని, ఒకటి…రెండు రోజుల్లో పరిస్థితి అదుపులోనికి వస్తుందని మణిపూర్ డీజీపీ దౌంగెల్ తెలిపారు. మొత్తం 20 వేల మంది బాధితులు సురక్షిత ప్రాంతాల్లో సైన్యం పర్యవేక్షణలో ఆశ్రయం పొందుతున్నారని ఏడీజీపీ అశుతోష్ సిన్హా తెలిపారు. మరోవైపు ఘర్షణల్లో మిలిటెంట్లు తమంత తాముగా జోక్యం చేసుకొని సైన్యంపైకి కాల్పులు జరిపారు.