దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని, జూన్ 9న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, సికింద్రాబాద్ లో దానం నాగేందర్ ను గెలిపిస్తే కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నాది అని రేవంత్ అన్నారు. డబల్ ఇంజన్ సర్కార్. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ నాయకులు, బీజేపీ తరపున రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన జాతీయ నేతలు కేంద్రంలో బీజేపీ ఉంది. రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకుంటే డబల్ ఇంజన్ సర్కార్లతో అభివృద్ది సాధ్యం అని చెబుతూ వచ్చారు.
తాజాగా సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ సంధర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సరిగ్గా నెలన్నరలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, త్వరలో మనకూ డబల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని’’ చెప్పడం ఆసక్తి కలిగించింది. బీజేపీ నినాదం డబల్ ఇంజన్ ను రేవంత్ ఎత్తుకోవడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని, జూన్ 9న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, సికింద్రాబాద్ లో దానం నాగేందర్ ను గెలిపిస్తే కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నాది అని రేవంత్ అన్నాడు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ను ఎలాంటి అభివృద్ది చేయలేదని, కిషన్ రెడ్డిని గెలిపించేందుకే బీఆర్ఎస్ పార్టీ పద్మారావు గౌడ్ ను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆరోపించారు.
అయితే నిజామాబాద్ లో జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో వ్యవసాయ శాఖా మంత్రిని చేయిస్తానని చెప్పిన రేవంత్ ఈ రోజు దానం నాగేందర్ ను కేంద్రమంత్రిని చేసే బాధ్యత నాది అని చెప్పడం చర్చకు తెరలేపింది. రాష్ట్రంలో తన మంత్రి వర్గంలో ఇచ్చే మంత్రి పదవులే ఆయన చేతిలో లేవు. ఇక కేంద్రంలో పదవులు అని చెప్పడం ఏంటని ఎద్దేవా చేస్తున్నారు. మరి రేవంత్ కోటాలోనే కేంద్రంలో ఇద్దరు మంత్రులు అయితే అధిష్టానం మదిలో ఉన్న వారి మాటేమిటి ? అన్న వాదన కూడా వినిపిస్తున్నది. మరి రేవంత్ జోస్యాలు నిజమవుతాయా ? ఆయన చెప్పిన వారికి మంత్రి పదవులు దక్కుతాయా ? వేచిచూడాలి.