బిగ్ బ్రేకింగ్... ఏపీ పోలీసుల అదుపులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి!?


ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు పాల్పడిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈవీఎం మెషిన్ ను ఆయన ధ్వంసం చేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో వైరల్ అవ్వడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందని అంటున్నారు.


అయితే ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని.. హైదరబాద్ వైపు ఆయన వాహనాలు వెళ్లాయని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. విమానాశ్రయాలను సైతం అలర్ట్ చేసినట్లు కథనాలొచ్చాయి. ఈ సమయంలో ఆయనపై సుమారు 10 సెక్షన్స్ లతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది! ఈసీ ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ముమ్మరంగా గాలించి ఆయనను సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ గెస్ట్‌ హౌస్‌ లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో రామకృష్ణారెడ్డితో పాటు అతని సోదరుడూ ఉన్నారని అంటున్నారు.

కాగా... మే 13 పోలింగ్‌ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారనే ఆరోపణలతో ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో... మూడు చట్టాల పరిధిలో10 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఐపీసీ సెక్షన్ 143, 147, 353, 427, 448, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయని సమాచారం. ఈనెల 20వ తేదీనే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు చెబుతున్నారు. ఇదే విషయంపై స్పందించిన సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా... సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని.. అవన్నీ నిరూపణైతే ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

పిన్నెల్లి అరెస్ట్ వార్తలపై సంగారెడ్డి ఎస్పీ రియాక్షన్
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారంటు వస్తున్న వార్తలపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ స్పందించారు! ఇందులో భాగంగా ఈ అరెస్ట్ పై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. అయితే... ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనను అరెస్ట్ చేయాలని తమతో ఏపీ పోలీసులు చెప్పినట్లు మాత్రం ఎస్పీ రూపేష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నామని, అదుపులోకి తీసుకున్నట్లు తమకే తెలియదని అన్నారు.