ఏలూరు జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన కేరళ రైతుల బృందం


ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో “ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం” ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు బుధవారం కేరళ రైతుల బృందం ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటించడం జరిగింది.


ఏలూరు జిల్లా, ఏలూరు/పెదవేగి: బృంద సభ్యులు తొలుత జిల్లాలోని వెంకటాపురం గ్రామంలో దేశీ విత్తనాలతో 16 ఎకరాల్లో సాగు చేసిన వరి A గ్రేడ్ కాంపాక్ట్ బ్లాక్ ను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో వినూత్నంగా వరిగట్ల మీద పంటలను వేయడం గమనించిన రైతుల బృందం రసాయనాలతో సాగుచేసిన పంటలను కూడా పరిశీలించి వ్యత్యాసాన్ని గమనించారు. 

అనంతరం ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్న రైతులతో ముచ్చటించారు. లక్ష్మీపురం గ్రామంలో రైతు చక్రపాణి 10 ఎకరాల్లో పామ్ ఆయిల్, కొబ్బరి తోటలో అంతర పంటలుగా వేసిన వక్క, మిరియాల పంటలను పరిశీలించారు. వేంపాడు గ్రామంలో “ఏపీ సి ఎన్ ఎఫ్” అధికారులు ప్రకృతి వ్యవసాయ తొమ్మిది సార్వత్రిక సూత్రాల చక్రాన్ని ప్రదర్శించి ఆ సూత్రాల వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని వివరించారు.


అలాగే అదే గ్రామంలో జీవ ఉత్ప్రేరకాలు, కషాయాల తయారీ విధానాన్ని తిలకించి ఎన్ పీ ఎమ్ దుకాణాన్ని సందర్శించారు. అమ్మపాలెం గ్రామంలో ప్రి-మాన్సూన్ డ్రై సోయింగ్ అనుసరిస్తున్న రైతులు, విత్తనం నుండి పంట కోత వరకు ప్రకృతి వ్యవసాయం అవలంబిస్తున్న రైతులు, మెంటార్‌లు, రైతు శాస్త్రవేత్తలతో పరస్పరం చర్చించారు. 

రంగయ్య, సత్తిబాబు‌లకు చెందిన ఐదు అంతస్తుల నమూనా, కొబ్బరి A గ్రేడ్ మోడల్‌ను కూడా కేరళ రైతులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీ కృష్ణా రావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డిపిఎం తాతారావు, అడిషనల్ డీపీఎం బి వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి సంధ్యా తదితరులు పాల్గొన్నారు.