ప్రత్యేక హోదా మరచిన ఏపీ రాజకీయ పార్టీలు..!ఆర్ధిక సంఘం ముందు నోరెత్తని వైనం..!


ANDRAPRADESH: విభజనతో నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. ముందు ఐదేళ్లు ఇస్తామంటే కాదు పదేళ్లు, పదిహేనేళ్లంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. చివరికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో ప్రధాని ప్రకటించారు. అయితే ఆ తర్వాత కేంద్రంలో యూపీఏ స్ధానంలో వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం దీన్ని పూర్తిగా మర్చిపోయింది.


గతంలో టీడీపీతో కలిసి ఏపీలో, కేంద్రంలో అధికారం పంచుకున్న ఎన్డీయే నేతలు ప్రత్యేక హోదాను ఉద్దేశపూర్వకంగానే పక్కనబెడుతూ వచ్చారు. కానీ రాష్ట్రంలో అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోరు పెట్టడంతో ప్రత్యేక హోదా స్ధానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం, దాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. అయితే దీన్ని ఏపీ ప్రజలు అంగీకరించలేదు. ఇదే అదనుగా తమకు 25 మంది ఎంపీలిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానంటూ జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అయినా పరిస్ధితిలో మార్పేమీ లేదు. మరో ఐదేళ్లు గడిచిపోయాయి.

అప్పటికే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ పదే పదే చెప్పుకొచ్చిన బీజేపీకి వంత పాడుతూ ఏపీలో రాజకీయ పార్టీలు కూడా ఈ డిమాండ్ ను పూర్తిగా పక్కనబెట్టేశాయి. మొదట్లో 14వ ఆర్దిక సంఘం ప్రత్యేక హోదాకు సిఫార్సు చేయలేదని చెప్పుకున్న కేంద్రం... ఆ తర్వాత 15వ ఆర్ధిక సంఘం క్లారిటీ ఇచ్చినా హోదా ఇచ్చేందుకు మాత్రం అంగీకరించలేదు. ఇప్పుడు 16వ ఆర్దిక సంఘం కూడా వచ్చేసింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్దిక సంఘం సభ్యులకు రెడ్ కార్పెట్ పరిచిన చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదా మినహా అన్నీ అడిగింది. అదే బాటలో కూటమి పార్టీలు, విపక్ష పార్టీలు కూడా నడిచాయి. 

రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయంటూ చెబుతూ వస్తున్న కేంద్రం.. అప్పట్లో ఏ ధైర్యంతో ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీకి హామీ ఇచ్చిందంటే జవాబు దొరకదు. అప్పట్లో యూపీఏ సర్కార్ ఏపీని మోసం చేసిందని, తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వేదికగా ప్రధాని కాక ముందే మోడీ ఇచ్చిన హామీ ఆయన అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు అయిపోయింది. అయినా దీన్నీ అడిగే పరిస్ధితి ఏ రాజకీయ పార్టీకీ లేదు. దీంతో ఇవాళ 16వ ఆర్ధిక సంఘం సభ్యులతో భేటీ అయిన రాజకీయ పార్టీలు కేంద్రం నుంచి వచ్చే నిధులపై మాత్రమే అడిగి మమ అనిపించేశాయి.

ఇలా ఆర్ధిక సంఘాన్ని ప్రత్యేక హోదా అడక్కుండా రేపు కేంద్రం వద్దకు వెళ్లి ప్రత్యేక హోదా కావాలని అడిగినా తమకు ఆర్ధిక సంఘం నుంచి ఎలాంటి సిఫార్సులు రాలేదని చెప్పి తప్పించుకునేందుకు ఏపీ రాజకీయ పార్టీలు గొప్ప అవకాశం ఇచ్చాయి. ఇప్పటికే పలు సాకులు చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పుష్కరకాలంగా తప్పించుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్ధితి ఏపీలో ఏ పార్టీకీ లేదు. అయితే ఆర్ధిక సంఘానికి ప్రతిపాదన ఇచ్చే దమ్ము కూడా లేకుండా పోయిందా అన్న చర్చ రాష్ట్ర ప్రజల్లో జరుగుతోంది. దీనికి ఏ రాజకీయ పార్టీ వద్దా సమాధానం లేదు. ప్రత్యేక హోదాను గట్టిగా అడిగే దమ్ములేని పార్టీలు ఇక కేంద్రాన్ని నిధుల కోసం ఏమాత్రం ప్రయత్నాలు చేస్తాయన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆర్ధిక సంఘాన్ని ఏపీ రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా అడగకపోవడం వెనుక ఓ కీలక కారణం మాత్రం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన ఇప్పుడు ప్రత్యేక హోదా అడిగితే ప్రధాని మోడీ ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సి వస్తుందో అని సైలెంట్ గా ఉండిపోయినట్లు తెలుస్తోంది. అటు వైసీపీ సైతం ప్రధానికి, కేంద్రానికి కోపం తెప్పించకుండా ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురాలేదని అర్దమవుతోంది. ఇక మిగిలిన పార్టీల సంగతి సరేసరి. ప్రత్యేక హోదా విషయంలో ఇంత నిర్లిప్తంగా ఉండిపోతున్న పార్టీలు.. రాష్ట్ర భవిష్యత్తు, నిధుల విషయంలో భవిష్యత్తులో ఇంకేం ప్రయత్నాలు చేస్తాయన్న చర్చ జరుగుతోంది. దీంతో ప్రత్యేక హోదా ఇక పూర్తిగా అటకెక్కేసినట్లే అన్న ప్రచారం జరుగుతోంది.